Site icon NTV Telugu

RRR vs KGF2 : ‘ట్రిపుల్ ఆర్’ను ‘కేజీఎఫ్-2’ అధిగమిస్తుందా!?

Kgf Rrr

Kgf Rrr

ఏమది? ఎంతటి ఆశ్చర్యం!? దక్షిణాదిన నేడు తెలుగు సినిమారంగంతో పోటీ పడే స్థితి ఎవరికీ లేదే? అటువంటిది ఓ కన్నడ పాన్ ఇండియా మూవీ మన తెలుగు క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ రికార్డును అధిగమించుటయా!? ఎంతటి విడ్డూరమూ! రాజమౌళి భారీ ప్రాజెక్ట్ గా విడుదలైన ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఉత్తరాదిన మంచి వసూళ్ళు చూసిందని ఇటీవల హిందీ రైట్స్ తీసుకున్న వారు ముంబయ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాను కూడా ఆహ్వానించి, తమ ఆనందం పంచుకున్నారు. ఆ ఆనందం ఇంకా తెలుగువారి మదిలో ఉండగానే కన్నడ పాన్ ఇండియా మూవీ ‘కేజీహెచ్- ఛాప్టర్ 2’ ఓ విధంగా ‘ట్రిపుల్ ఆర్’ను అధిగమించిందన్న వార్త ఉత్తరాది మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అసలు విషయానికి వస్తే – యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్-2’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే రూ.20 కోట్లు పోగేసిందట! అందులో రూ.11.4 కోట్లు కేవలం హిందీ వర్షన్ నుండే లభించిందని ముంబయ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు ‘కేజీఎఫ్-2’ విడుదలకు ముందే ఈ స్థాయి వసూళ్ళు చూడడం శుభారంభమని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ అంటున్నారు. ముంబై, పూనెలో ఈ సినిమాను ఏప్రిల్ 14న ఉదయం ఆరు గంటల నుంచే ప్రదర్శించనున్నారనీ, టిక్కెట్ రేట్లు ముంబైలో రూ.1450, రూ.1500 కాగా, ఢిల్లీలో రూ.1800, రూ.2000 ఉన్నాయని తరుణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ట్రేడ్ పండిట్స్ లెక్కల ప్రకారం రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.5 కోట్లు పోగేసిందని, ‘కేజీఎఫ్-2’ ఇప్పటికే రూ.11.4 కోట్లు మూట కట్టుకోవడం గమనార్హమని అంటున్నారు. ఇక తరుణ్ తన ట్వీట్ లో “తుఫాన్ ఈజ్ అరైవింగ్” అని ముగింపు పలకడంతో ఈ చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ను అధిగమిస్తుందనీ కొందరు భావిస్తున్నారు. మరి ‘కేజీఎఫ్-2’ విడుదలయ్యాక ఎవరి అంచనాలు ఏ రీతిన ఫలిస్తాయో చూడాలి.

Exit mobile version