Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Keerthy Suresh1

Keerthy Suresh1

Kalki 2898 AD: ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఫిక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’. దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ డిస్టోపియన్ ప్రపంచంలో ప్రభాస్ భైరవగా ఆకట్టుకుంటే, అతని వెంట నీడలా తిరిగే ‘బుజ్జి’ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ రోబోటిక్ పాత్రకి మహానటి కీర్తి సురేశ్ తన గొంతుతో ప్రాణం పోశారు. అయితే ఈ పాత్ర వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉందని తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘మహానటి’ సినిమా సమయంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్, కీర్తి సురేశ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే నమ్మకంతో ‘కల్కి 2898 ఏడీ’ కోసం కూడా ఆమెను సంప్రదించిన నాగ్ అశ్విన్, మొదట బుజ్జి పాత్రను కాకుండా వెండితెరపై కనిపించే ఒక ప్రత్యేక ఆన్ స్క్రీన్ పాత్రను ఆఫర్ చేశారట. కథ, పాత్ర గురించి పూర్తిగా వివరించినప్పటికీ ఆ క్యారెక్టర్‌పై కీర్తి సురేశ్‌కు పూర్తి నమ్మకం కలగలేదు. దీంతో మర్యాదపూర్వకంగానే ఆ ఆఫర్ ను ఆమె తిరస్కరించారట. అయితే కథ అక్కడితో ముగియలేదు. మరుసటి రోజే నాగ్ అశ్విన్ నుంచి కీర్తికి ఒక సరదా మెసేజ్ వచ్చింది. తన సినిమాలో కనీసం ఒక గోడ చాటు నుంచి అయినా తొంగి చూస్తావా అంటూ ఆయన పంపిన సందేశం కీర్తిని ఎంతో ఆలోచింపజేసిందట. నాగ్ అశ్విన్ సినిమాల్లో భాగం కావాలనే తన కోరికను గుర్తు చేసుకున్న ఆమె, వెంటనే మరో అవకాశం గురించి మాట్లాడగా దర్శకుడు ఒక కొత్త ప్రయోగాన్ని వివరించారు.

ఈసారి ఆయన చెప్పింది పూర్తిగా భిన్నమైన పాత్ర. షూటింగ్‌లో కనిపించాల్సిన అవసరం లేదని, కేవలం తన గొంతు మాత్రమే కావాలని నాగ్ అశ్విన్ చెప్పినప్పుడు కీర్తి మొదట ఆశ్చర్యపోయారట. హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాల్లో కనిపించే జార్విస్ తరహాలో ఒక స్మార్ట్ రోబోటిక్ వాహనాన్ని రూపొందిస్తున్నామని, దానికి ప్రత్యేకమైన వాయిస్ ఓవర్ అవసరమని వివరించడంతో వెంటనే అంగీకరించానని ఆమె తెలిపారు. అలా పుట్టిందే ‘బుజ్జి’ పాత్ర. ఆతర్వాత కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా ‘బుజ్జి’ నిలిచింది. ముఖ్యంగా ప్రభాస్, బుజ్జి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఈ పాత్ర కోసం కీర్తి సురేశ్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో కూడా స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. దీంతో ప్రతి భాషలోనూ బుజ్జి పాత్రకు ఒకే తరహా ఎనర్జీ అందించగలిగారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, మొదట ఆన్ స్క్రీన్ పాత్రను తిరస్కరించడం వల్లే తనకు బుజ్జి లాంటి గుర్తుండిపోయే పాత్ర దక్కిందని కీర్తి సురేశ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ‘కల్కి 2898 ఏడీ’ విడుదలై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్న కీర్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆమె ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ‘రౌడీ జనార్దన్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ‘కల్కి’ ప్రపంచం కూడా సీక్వెల్‌తో మరింత విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్తులో బుజ్జి పాత్రకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.