NTV Telugu Site icon

తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్యగాయకులు ఎవరు?

తెలుగు చిత్రసీమలో చాలా అంశాలు చరిత్రకు అందక దూరంగా నిలిచాయి. అసలు మన తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఎప్పుడు విడుదలయిందో మొన్నటి దాకా చాలామందికి తెలియదు. ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలయిందని చాలా రోజులు సాగింది. అయితే లభిస్తున్న సాక్ష్యాధారాల ప్రకారం ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6 విడుదలయింది. అలాగే మన తెలుగు సినిమా రంగంలో తొలి నేపథ్యగాయకుడుగా ఎమ్.ఎస్. రామారావును, తొలి నేపథ్యగాయనిగా రావు బాలసరస్వతీదేవిని చెప్పుకుంటూ ఉంటాము. అయితే అది కూడా సత్యదూరమే! సాక్ష్యాధారాల ప్రకారం మన తొలి నేపథ్యగాయకుడు మాస్టర్ సాబు. అలాగే తొలి నేపథ్యగాయని బెజవాడ రాజరత్నం అని తేలుతోంది. సాంకేతికంగా చూసినా వీరిద్దరే మన తొలి నేపథ్యగాయకులు.

అసలు కథ…

1941లో వచ్చిన వాహినీ వారి ‘దేవత’ చిత్రంలో ఒక రేడియో పద్యం వుంది. అది రామారావు పాడిందే. కానీ అది ప్లేబ్యాక్ పాట అనిపించుకోదు. కారణం ప్లేబ్యాక్ అంటే తెరమీద ఒక పాట గాని, పద్యం గాని సన్నివేశంలో నటించే నటుడికి వెనుకనుంచి గొంతు అరువిచ్చేది అని అర్థం. ఎం.ఎస్.రామారావు ‘తహసిల్దార్’ (1944) సినిమాలో హెచ్. ఆర్. పద్మనాభశాస్త్రి సంగీత దర్శకత్వంలో కమలా కొట్నిస్ (రజని పాత్రలో) తో కలిసి ”ప్రేమలీలా మోహనకలసి చేకొనుమా కలసి- రాగమయీ మన జీవనసరణి భోగమనోహరమా, రాగదే రజనీ” అనే పాటలో సి.చ్. నారాయణరావు (తాసీల్దార్ పాత్రలో) కు ప్లేబ్యాక్ పాడారు. అదే ఎం.ఎస్. రామారావు పాడిన తొలి ప్లేబ్యాక్ పాట. నిజానికి ఈ సినిమా కంటే ముందే అంటే 1939 ఏప్రిల్ 1న విడుదలైన వాహినీ వారి ‘వందేమాతరం’ సినిమాలో “పూలో- పూలో- పూలో కనీ కొనుడు- పూలూ, మల్లె, మాలతి, జాజీ, గులాబీలు, విరాజాజీ, కనకాంబరి, సంపంగీ నీలాంబరి… ” అంటూ పాట పాడిన మాస్టర్ సాబు తొలి నేపథ్య గాయకుడు. చిత్తూరు.వి. నాగయ్య సంగీత దర్శకత్వం నిర్వహించిన ఈ పాటను రోడ్డు మీదే ‘లైవ్’ గా రికార్డు చేశారు. కానీ అది సరిగ్గా రికార్డు కాలేదు. అప్పుడు శబ్దగ్రాహకుడు శేఖర్, ఛాయాగ్రాహకుడు రామనాథ్ కలిసి ఈ పాటను మాస్టర్ సాబు చేత స్టూడియోలో మరలా పాడించి మాస్టర్ కృష్ణ నటించిన పాటమీద సూపర్ ఇంపోజ్ చేసి ఎడిటింగ్ చేశారు. నిజానికి సాంకేతికత అంతగా అభివృద్ధి చెందకపోవడంతో ఈ పాట లిప్ సింక్ కాలేదు. అందుచేత అందుబాటులోవున్న రికార్డులపరంగా తొలి నేపథ్య గాయకునిగా మాస్టర్ సాబు అని గుర్తించాల్సి వుంటుంది.

చరిత్ర తెలుసుకుంటే…

ఇక తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతీదేవి అని అందరూ అనుకుంటారు. తొలి నేపథ్య గాయని బెజవాడ రాజరత్నం అని గ్రహించాలి. తెలుగు టాకీ సినిమాలు వచ్చిన కొత్తల్లో నేపథ్య గాయకులు, నేపథ్య గాయనీమణులు అంటూ ఎవరూ వుండేవారు కాదు. నటీనటులే సొంతంగా పాడుకునేవారు. ఇంకొక్క అడుగు ముందుకు వెళితే…. రావు బాలసరస్వతి ఇల్లాలు(1940) సినిమాలో సాలూరు రాజేశ్వరరావు తో కలిసి “కావ్యపానము చేసి కైపెక్కినానే, దివ్యలోకాలాన్ని తిరిగొచ్చినానే” (హచ్చిన్ వారి రికార్డు నంబరు S.N.832), ”సుమకోమల కనులేల” అనే రెండుపాటల్ని పాడారు. అయితే ఈ పాటలకు అభినయం ఆవిడే కనుక అది నేపథ్య గీతం అనిపించుకోదు. 07-01-1943 న కె.వి.రెడ్డి దర్శకత్వంలో వాహినీ వారి ‘భక్తపోతన’ సినిమా విడుదలైంది. అందులో భోగిని అనే నర్తకి కల్యాణి రాగంలో ఒక జావళి పాడుతూ నాట్యం చేస్తుంది. “ఇది మంచి సమయము రారా చలమేల చేసేవేరా” అనే ఆ పాటను బెజవాడ రాజరత్నం పాడగా సామ్రాజ్యం అనే నర్తకి మీద చిత్రీకరించారు. అదే తెలుగు సినిమాలో తొలి నేపథ్య గీతం. ఆ విధంగా బెజవాడ రాజారత్నం తొలి నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. అయితే ఇక్కడ మరో సంఘటన కూడా గుర్తు చేయాలి. 04-03-1943 న శ్రీ రేణుకా వారి ‘భాగ్యలక్ష్మి’ సినిమా విడుదలైంది. అందులో నాగయ్య, మాలతి, సూర్యకుమారి, కృష్ణన్, గౌరీపతి శాస్త్రి, మధురం, కమలాకోట్నిస్ తారాగణం. సముద్రాల పాటలు లిఖించగా భీమవరపు నరసింహారావు సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇందులో కమలా కొట్నిస్ ‘కుంజీ’ అనే జిప్సీ యువతిగా నటించింది. ”తిన్నె మీద సిన్నోడా వన్నెకాడా… తేనెతుట్టి లాటి ఓ పిన్నవాడా” అనే పాటకు కమలాకొట్నిస్ నాట్యం చేస్తుంది. ఈ పాటను బెజవాడ రాజరత్నం ఆలపించారు. అలాగే జిప్సీల కోరస్ పాట “కులుకుత పలకయే కుకాలుగా” లో కూడా బెజవాడ రాజరత్నం తన గొంతును వినిపించారు. ఇదే సినిమాలో సుమతి(కమల) అనే అమ్మాయి ”చేస్తాను పెండ్లికొడుకును చేస్తాను…ముస్తాబు మా అన్నకు నేనే చేస్తాను”అనే పాట పాడుతుంది. సినిమాలో సుమతి పాడగా రికార్డు కోసం ఆ పాటను రావు బాలసరస్వతి చేత పాడించారు. ఆరోజుల్లో విడుదలైన గ్రామఫోను రికార్డులో ఒకవైపు బెజవాడ రాజరత్నం పాడిన ”తిన్నె మీద సిన్నోడా వన్నెకాడా…తేనెతుట్టి లాటి ఓ పిన్నవాడా”పాట వుండగా రెండో వైపు బాలసరస్వతి పాడిన ”చేస్తాను పెండ్లికొడుకును చేస్తాను…ముస్తాబు మా అన్నకు నేనే చేస్తాను”వుంటుంది. అలా తొలి నేపథ్యగాయని బెజవాడ రాజరత్నం అవుతారు కానీ, రావు బాలసరస్వతీ దేవి కారు. ఈ విషయాన్ని గతంలో వి.ఎ.కె.రంగారావు ధ్రువీకరించగా, రావి కొండలరావు ఏకీభవించారు. చరిత్ర వక్రీకరణకు గురి కాకూడదన్నదే ఈ సుదీర్ఘ వివరణకు కారణం.