క్రిస్టఫర్ నోలాన్ తన తాజా చిత్రం ‘అపన్ హైమర్’ జూలై 21న జనం ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ ను సినిమాకాన్ లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తాను ఐమాక్స్, 70 ఎమ్.ఎమ్., 35 ఎమ్.ఎమ్. ఫార్మాట్స్ లో తెరకెక్కించానని చెప్పారు క్రిస్టఫర్. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లోనూ, కొంత కలర్ లోనూ రూపొందించారు. అయితే ఎక్కువభాగం రంగుల్లోనే ఉంటుందని హామీ ఇచ్చారు క్రిస్టఫర్. అమెరికన్ థియరాటికల్ ఫిజిసిస్ట్ జె.రాబర్ట్ అపన్ హైమర్ జీవితగాథ ఆధారంగా క్రిస్టఫర్ తన ‘అపన్ హైమర్’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో పెద్దగా డ్రామా ఉండకపోయినా, ఆ ఫిజిసిస్ట్ జీవితంలోని కొన్ని కోణాలు నవతరం ప్రేక్షకులను ఆలోచింప చేసేలా ఉంటాయని నోలాన్ అన్నారు. అటామిక్ బాంబ్ కనుగొనడంలో అపన్ హైమర్ పాత్ర కీలకమైనదని, దాని చుట్టూ తిరిగే కథ కూడా అందరినీ అలరించేలా ఉంటుందని నోలాన్ చెబుతున్నారు.
రేపు ‘అపన్ హైమర్’ రిలీజయిన తరువాత ఎంతమందికి నచ్చుతుందో తెలియదు కానీ, తాను కనుగొన్న అటామిక్ బాంబ్ ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ముందే హెచ్చరించిన వ్యక్తి జీవితంపై సినిమా తీయడం తనకు సంతృప్తి కలిగించిందని నోలాన్ వివరించారు. ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్ లో చూస్తేనే థ్రిల్ కలిగిస్తుందనీ ఆయన అన్నారు. ఈ చిత్రంలో అపన్ హైమర్ పాత్రను సిల్లియన్ మర్ఫీ పోషించారు. గతంలో నోలాన్ తెరకెక్కించిన “ఇన్ సెప్షన్, బ్యాట్ మన్ బిగిన్స్, ద డార్క్ నైట్, డార్క్ నైట్ రైజెస్, డన్ కిర్క్” చిత్రాల్లో నటించిన సిల్లియన్ మర్ఫీ తొలిసారి నోలాన్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. దాంతో మర్ఫీ ఆనందం అంబరమంటుతోంది. మరి మర్ఫీ ఆనందం, నోలాన్ ఆత్మవిశ్వాసం ‘అపన్ హైమర్’ను ఏ స్థాయిలో నిలుపుతాయో చూడాలి.