NTV Telugu Site icon

రివ్యూ: వివాహ భోజనంబు

Vivaha Bhojanambu Movie Review

Vivaha Bhojanambu Movie Review

ఈ మధ్య కాలంలో కమెడియన్స్ ఒక్కొక్కరూ హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో హాస్యనటుడు సుహాస్ ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మారాడు. ఇప్పుడు సెకండ్ వేవ్ టైమ్ లో సత్య ‘వివాహ భోజనంబు’తో హీరో అయిపోయాడు. విశేషం ఏమంటే… ‘కలర్ ఫోటో’ మూవీ ఓటీటీలో విడుదలైనట్టుగానే ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ సైతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో ప్రసారం అవుతున్న తొలి తెలుగు ఫీచర్‌ ఫిల్మ్ ఇదే కావడం విశేషం.

కథ విషయానికి వస్తే… రాజారాం (సుబ్బరాయ శర్మ)ది ఉమ్మడి కుటుంబం. బాగా ఆస్తిపరులు. ఆయన మనవరాలు అనిత (ఆర్జవీ) ఎల్.ఐ.సీ. ఏజెంట్ మహేశ్ (సత్య)తో ప్రేమలో పడుతుంది. పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకోవాలని భావిస్తుంది. ఆస్తి విషయంలో తమ కుటుంబ స్థాయికి, అందం విషయంలో తన మనవరాలికి ఏ మాత్రం సరితూగని మహేశ్ తో పెళ్ళి చేయడానికి రాజారాంకు మనసొప్పుకోదు. ఇక అనిత తండ్రి అయితే కుర్రాడి ఇంటికి వెళ్ళి, వాళ్ళ వాలకం స్వయంగా చూసొచ్చి పెళ్ళికి ససేమిరా అంటాడు. కానీ వీరొకటి తలిస్తే దైవం వేరొకటి తలచినట్టు వాళ్ళిద్దరి పెళ్ళీ అనిత కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా అయిపోతుంది. స్కూటర్ పార్కింగ్ కోసం పది రూపాయలు ఖర్చు చేయడానికి అంగీకరించని మహేశ్ ఇంటిలో కరోనా లాక్ డౌన్ కారణంగా అనిత కుటుంబ సభ్యులంతా కొన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. ఆ జాయింట్ ఫ్యామిలీతో మహేశ్ పడిన పాట్లు ఏమిటీ? అసలు అనాకారిగా ఉండే మహేశ్ లో అనితకు నచ్చిందేమిటీ? సినినారి మొగుడితో అనిత ఎలా వేగింది? అనేది మిగతా కథ.

యేడాది క్రితం కరోనా కారణంగా అందరి జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. మధ్యతరగతి జీవితాలకు తగిలిన ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కావు. కొందరైతే… పిల్లల కిడ్డీ బ్యాంక్ లోని డబ్బుల్ని సైతం తీసి వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్టసమయంలోని కొన్ని నిజ సంఘటనలను వినోదాత్మకంగా తెరకెక్కించే పని కొందరు ఇప్పటికే చేశారు. అలా కరోనా నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో ఒకటి ‘ఏక్ మినీ కథ’. ఈ సినిమా చూస్తుంటే అందులోని కొన్ని సన్నివేశాలు మనసులో మెదులుతాయి. అలానే ‘జాంబిరెడ్డి’ మూవీని కరోనా టైమ్స్ మూవీగానే భావించాల్సి ఉంటుంది. ఇక పిసినారి హీరోలతో వచ్చిన కథలలోని కొన్ని సన్నివేశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. అయితే… మహేశ్ పిసినారితనానికి, పెద్దంత అందంగా లేకపోయినా అతని మీద అనిత మనసు పారేసుకోవడానికి దర్శకుడు చూపించిన కారణాలు సబబుగా అనిపిస్తాయి. సినిమా అంతా వినోదాల విందులానే సాగిపోతుంది. డైలాగ్ కామెడీ అద్భుతంగా పేలింది. అయితే పెద్దంత కథ లేకపోవడం, సీన్స్ అన్నీ ఒకే చోట జరగడంతో కాస్తంత మొనాటనీగా అనిపిస్తుంది.

హీరోగా సత్య ఆ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడు. తానో హీరో అనే బిల్డప్ ఇవ్వకుండా, పాత్ర పరిధి మేరకు నటించాడు. కాబట్టి… ఇదేదో సత్య హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన సినిమాగా మనకు అనిపించదు. హీరోయిన్ ఆర్జవీకి తెలుగులో ఇదే మొదటి సినిమా. చూడటానికి బాగుంది. నటన గురించి పెద్దంత చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘జాతిరత్నాలు’ నాయిక ఫరియా అబ్దుల్లా పోలికలు ఈ అమ్మాయిలో కాస్తంత కనిపిస్తున్నాయి. సుబ్బరాయ శర్మ చాలా కాలం తర్వాత ఇందులో కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ తన నటనతో మెప్పించాడు. స్వీట్స్ అంటే పడి చచ్చిపోయే పాత్రలో శివన్నారాయణ, హీరో స్నేహితుడిగా సుదర్శన్, ఇతర ప్రధాన పాత్రలలో మధుమణి, కల్పలత ఇటీవల కన్నుమూసిన టీఎన్ఆర్ తదితరులు కనిపిస్తారు. వైవా హర్ష కనిపించేది కొద్దిసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు మరో హైలైట్ సందీప్ కిషన్ చేసి నెల్లూరు ప్రభ క్యారెక్టర్.

దర్శకుడు రామ్ అబ్బరాజు తొలియత్నంలోనే మంచి మార్కులు పొందాడు. అయితే… సన్నివేశాలను ఇంకాస్తంత కొత్తగా తీసి ఉంటే బాగుండేది. అయితే ఎక్కడా అతిగా లేకుండా సాఫీగా బండిని నడిపేశాడు. అనివీ సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్యంలో వచ్చే గీతం ఆకట్టుకుంది. మణికందన్ సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. నందు ఆర్. కె. మాటలు సరదాగా ఉన్నాయి. ఊహకందని ట్విస్టుల్ని, గూజ్ బంబ్స్ కలిగించే సీన్స్ ను ఈ మూవీని నుండి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయకూడదు. కానీ కుటుంబం అంతా కూర్చుని సరదాగా దీన్ని చూసేయొచ్చు. ‘వివాహ భోజనంబు’ పేరుతో సందీప్ కిషన్ కు చెయిన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. బహుశా ఆ పేరుకూ పాపులారిటీ వస్తుందని ఈ సినిమాకు అదే పేరు పెట్టారేమో తెలియదు. అయితే ఈ కథకు కూడా ఇది యాప్ట్ టైటిల్ సో… నో ప్రాబ్లమ్!!

ప్లస్ పాయింట్స్

మైనెస్ పాయింట్

రేటింగ్ : 2.25 / 5

ట్యాగ్ లైన్: వినోద భోజనంబు!