Kiran Abbavaram: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమౌతున్నాడు. ఈ యేడాది ఇంతవరకూ వచ్చిన అతని చిత్రాలు ‘సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేదు. అయినా అతని మీద నమ్మకం ఉన్న నిర్మాతలు సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కిరణ్ నటిస్తున్న మూడు, నాలుగు సినిమాల షూటింగ్ వివిధ దశల్లో ఉంది. అందులో ఒకటి ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా నటిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురళి కిషోర్ గతంలో పని చేశారు. ఈ మూవీలో తిరుపతికి చెందిన విష్ణు అనే కుర్రాడిగా కిరణ్ అబ్బవరం నటిస్తున్నాడు. నవంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమాను షూటింగ్ సకాలంలో పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. వచ్చే ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా 17వ తేదీ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు.