NTV Telugu Site icon

Vikram: వైవిధ్యంతోనే విక్రమ్ పయనం!

Vikramm

Vikramm

Vikram: మొదటి నుంచీ విక్రమ్ విలక్షణ నటనతోనే జనాన్ని అలరిస్తూ సాగుతున్నారు. ‘చియాన్’గా తమిళ జనం మదిలో నిలచిన విక్రమ్ ఇప్పటికీ వైవిధ్యానికే పెద్ద పీట వేస్తున్నారు. మణిరత్నం మేగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’లో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్ అభినయం ఆకట్టుకుంది. ఆ సినిమా సీక్వెల్ గా ‘పొన్నియిన్ సెల్వన్-2’ త్వరలోనే జనం ముందుకు రానుంది. ఈ సారి కూడా తనదైన నటనతో విక్రమ్ ఈ చిత్రంలో అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

విక్రమ్ అసలు పేరు కెన్నడీ జాన్ విక్టర్. 1966 ఏప్రిల్ 17న జన్మించారు.ఆయన తండ్రి జాన్ విక్టర్ తరువాత వినోద్ రాజ్ పేరుతో తమిళ చిత్రాల్లో నటించారు. అయితే వినోద్ రాజ్ ఎన్ని చిత్రాలలో నటించినా, తాను కలలు కన్న స్టార్ డమ్ సొంతం చేసుకోలేక పోయారు. విక్రమ్ తల్లి రాజేశ్వరి సబ్ కలెక్టర్ గా పనిచేసేవారు. ఆమె తమ్ముడు ప్రముఖ నటుడు త్యాగరాజన్. తండ్రి, మేనమామ ఇద్దరి జీన్స్ కారణంగానేమో విక్రమ్ కు కూడా నటనపట్ల అమితాసక్తి కలిగింది. చదువుకొనే రోజుల నుంచీ విక్రమ్ నటుడు కావాలని తపించారు.
ఆరంభంలో విక్రమ్ “చిరునవ్వుల వరమిస్తావా, అక్కపెత్తనం -చెల్లెలి కాపురం, బంగారు కుటుంబం, ఆడాళ్ళా మజాకా, ఊహ, అక్కా బాగున్నావా?, మెరుపు, కుర్రాళ్ళ రాజ్యం, 9 నెలలు, యూత్” వంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లో నటించారు. ‘సేతు’ ఘనవిజయం సాధించిన తరువాత కూడా అంతకు ముందు అంగీకరించిన ‘యూత్’ చిత్రాన్ని పూర్తి చేశారు విక్రమ్. ఆ తరువాత నుంచీ విక్రమ్ తమిళనాట స్టార్ హీరో అయిపోయారు. వరుసగా వైవిధ్యమైన పాత్రల్లో తనదైన అభినయం ప్రదర్శిస్తూ సాగిపోయారు. విక్రమ్ హీరోగా తమిళనాట ఘనవిజయం సాధించిన అనేక చిత్రాలను తెలుగు స్టార్ హీరోస్ రీమేక్ చేయడం విశేషం. విక్రమ్ తో ‘సేతు’ తెరకెక్కించిన దర్శకుడు బాలా తరువాత అతనితో తీసిన ‘పితామగన్’ తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువాదమైంది. ఈ సినిమాతోనే విక్రమ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించారు. ‘శివపుత్రుడు’ సినిమా తెలుగులోనూ విశేషాదరణ చూరగొంది. ఇక ‘జెంటిల్ మేన్’ శంకర్ దర్శకత్వంలో విక్రమ్
నటించిన ‘అన్నియన్’ తెలుగులో ‘అపరిచితుడు’గా అలరించింది. ఈ సినిమా విక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. ఆ తరువాత నుంచీ విక్రమ్ పలు వైవిధ్యమైన పాత్రలతో సాగుతూనే ఉన్నారు. కానీ,’అపరిచితుడు’ స్థాయి విజయం మాత్రం మళ్ళీ విక్రమ్ కు దక్కలేదనే చెప్పాలి.

నటునిగానే కాకుండా, గాయకునిగానూ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ, టీవీ షోస్ తోనూ జనాన్ని ఆకట్టుకున్నారు విక్రమ్. తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించుకోవాలని ఇప్పటికీ తపిస్తూనే ఉన్నారు విక్రమ్. ఏదో ఒకరోజు విక్రమ్ మళ్ళీ విజృంభిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ అభిలాషను విక్రమ్ ఏ సినిమాతో నిజం చేస్తారో చూడాలి.

Show comments