Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. మొదటి నుంచి తనదైన యాటిట్యూడ్ తో అభిమానులను అలరిస్తూ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విజయ్ ఏది మాట్లాడితే అది సంచలనమే.. విజయ్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. ఇక విజయాలను, అపజయాలను చూసుకోకుండా వరుస సినిమాలను చేస్తూ ప్రస్తుతం లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ స్టార్ స్టేట్స్ వలన విజయ్ కు బలుపు పెరిగిందని పలువురు చెప్పుకొస్తున్నారు. విజయ్ చేస్తున్న పనులు కూడా అలాగే ఉన్నాయని అంటున్నారు. మొన్నటికి మొన్న స్టేజి పైన మా తాత ఎవరో తెలియదు.. తండ్రి ఎవరో తెలియదు అంటూ నెపోటిజం పై మాట్లాడి షాక్ ఇచ్చాడు. నిన్నటికి నిన్న జర్నలిస్టుల ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వాళ్లకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడాడని చెప్పుకొస్తున్నారు. దీంతో రౌడీ హీరోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో విజయ్ ను అభిమానులు తప్పుగా అర్ధం చేసుకున్నారని విజయ్ పీఆర్ టీం చెప్పుకొస్తుంది, దీనికి తోడు విజయ్ సైతం ఈ వివాదంపై స్పందించడం సంచలనంగా మారింది.
లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్- విలేఖరుల మధ్య సంభాషణ జరుగుతుండగా.. ఒక రిపోర్టర్ మీతో మాట్లాడాలంటే భయంగా ఉంది అని అనడంతో విజయ్ వారిని చిల్ చేయడానికి, వారిలో ఆ భయాన్ని పోగొట్టడానికి “ఎందుకంత ఇబ్బంది.. కంఫర్ట్ గా మాట్లాడండి. కాలు మీద కాలు వేసుకొని అడగండి. నేను కూడా కాలు మీద కాలు వేసుకొని సమాధానం చెప్తా అంటూ బెంచ్ మీద కాళ్లు పెట్టుకొని మాట్లాడాడు. అయితే దీన్ని అక్కడున్న వారెవరు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో వారికి తెలుసు కాబట్టి. కానీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం విజయ్ చేసింది తప్పు అన్నట్లు.. విజయ్ కు బలుపు పెరిగింది..? యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.. ఈ బలుపు చూపించడానికి అతని వెనుక ఎవరు ఉన్నారు అంటూ థంబ్ నెయిల్స్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు. ఇక ఈ రూమర్స్ పై ఎట్టకేలకు స్పందించాడు. “ఎవరైనా తమ రంగంలో ఎదగాలని ప్రయత్నిస్తారు. వారి వెనుక ఎల్లప్పుడూ లక్ష్యం ఉంటుంది – కానీ మేము పోరాడతాము. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, మీరే ప్రతి ఒక్కరి మంచిని కోరుకున్నప్పుడు – ప్రజల ప్రేమ మరియు దేవుని ప్రేమ మిమ్మల్ని రక్షిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది. ఎవరు ఎన్ని అన్నా మీకు తోడుగా మేము ఉన్నాం అని రౌడీ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
