NTV Telugu Site icon

Chittoor Nagaiah: చిత్తం దోచిన చిత్తూరు నాగయ్య అభినయం!

Chitooru Nagayya

Chitooru Nagayya

తెలుగునాట బహుముఖ ప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనంగా నిలచిన తొలి సూపర్ స్టార్ ఎవరంటే? చప్పున యన్టీఆర్ పేరు చెబుతూ ఉంటారు. నిజానికి రామారావు కంటే ముందు భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని, నటునిగా ఉన్నతశిఖరాలను అధిరోహించి, తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ఘనులు చిత్తూరు వి.నాగయ్య.
నటునిగా, గాయకునిగా, సంగీత దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఇలా తనలోని ప్రతిభను చాటుకుంటూ సాగారు నాగయ్య. ఆ రోజుల్లో తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ అంతటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన నటులు మరొకరు కానరారు. తెలుగు చిత్రసీమలో తొలిసారి ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఘనత నాగయ్య సొంతం. మన దేశంలో ఆ రోజుల్లోనే సినిమాకు లక్ష రూపాయల పారితోషికం పుచ్చుకున్న ఘనత కూడా ఆయనకే దక్కింది.

అప్పట్లోనే లక్షల రూపాయలు సంపాదించిన నాగయ్య తన సంపాదనను పేదవారికోసం వినియోగించారు. చిత్రసీమలో అవకాశాల కోసం పాట్లుపడేవారికి అన్నపానీయాలనైనా సమకూర్చాలనే సదుద్దేశంతో ఓ భవంతిని తీసుకొని, అక్కడ ముప్పూటలా భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు, అడిగిన వారికి లేదనకుండా సాయం చేశారు. సినిమాల్లో పోషించిన “పోతన, వేమన, త్యాగయ్య” వంటి పాత్రల ప్రభావం ఆయనపైనా ఉండేది. అందుకే దానగుణం అబ్బిందనేవారు. ఆయన దానగుణం గురించి దక్షిణాది మొత్తం చర్చించుకొనేవారు. నాగయ్య నటించిన ‘యోగి వేమన’ చిత్రం చూసి, ఓ బాలుడు ‘బాలయోగి’గా మారి జేజేలు అందుకున్నారు. అంటే నాగయ్యలోని నటుడు ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు.

‘భక్త పోతన’లో నాగయ్య అభినయం చూసి, సాక్షాత్తు పోతనామాత్యులే దిగివచ్చారా? అన్న తీరున ఆయన నటన సాగింది. ‘భక్త పోతన’ సాధించిన విజయం నాగయ్యలో ఉత్సాహం నెలకొల్పింది. దాంతో స్వీయ దర్శకత్వంలో ‘త్యాగయ్య’ చిత్రాన్ని నటించి, నిర్మించి, సంగీతం సమకూర్చారు. ఈ సినిమా విడుదలై అనూహ్య విజయాన్ని మూటకట్టుకుంది. ఈ సినిమా ప్రభావంతో ఎంతోమంది తెలుగునేలపై సంగీతం పట్ల అభిమానం పెంచుకున్నారు. ముఖ్యంగా త్యాగరాజు కీర్తనలు తెలుగునేలపై మరింత ప్రాచుర్యం పొందడానికి ఈ సినిమా ఎంతగానో దోహదపడింది. ఈ సినిమాను పండితపామర భేదం లేకుండా అందరూ ఆదరించారు. ఎందరో ఆ నాటి సంస్థానాధీశులు నాగయ్యను తమ సంస్థానాలకు ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. గజారోహణ చేశారు. అలా చిత్రసీమలో గజారోహణ అందుకున్న తొలి నటునిగా నాగయ్య నిలచిపోయారు. ఆ సినిమా తరువాత నాగయ్య కనిపిస్తే చాలు అందరూ పాదాభివందనాలు చేయడం ఆరంభించారు. ఒకానొక సమయంలో నాటి మేటి విద్యావేత్త, తరువాతి కాలంలో భారతదేశ రాష్ట్రపతిగా రాణించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఎవరో పాదాభివందనం చేశారట. ఆ పక్కనే నాగయ్య కూడా ఉన్నారట. అప్పుడు “నాలాంటి వారికి పాదాభివందనం చేసే బదులు నాగయ్యగారి లాంటి వారికి ప్రణమిల్లండి. పుణ్యమైనా దక్కుతుంది” అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారట. ఈ విషయాన్ని ఇప్పటికీ ఆ నాటి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సినిమా తారల పట్ల మీడియా ప్రాచుర్యం అంతగా లేని ఆ రోజుల్లోనే నాగయ్యకు ఆ స్థాయి గౌరవం లభించడం గమనార్హం! తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోనూ నాగయ్య నటించి మెప్పించారు. చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేసిన నాగయ్య, తరువాతి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. వాటిని అధిగమించడానికి అన్నట్టు తన స్థాయికి తగని పాత్రల్లోనూ నటించాల్సి వచ్చింది. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో తన బహుముఖ ప్రజ్ఞతో నాగయ్య అలరించిన తీరును ఎవరూ మరచిపోలేరు.