NTV Telugu Site icon

గళమే సాయికుమార్ బలం

Versatile Actor Sai Kumar Birthday Special

(జూలై 27న నటుడు, నిర్మాత సాయికుమార్ బర్త్ డే)

సాయి కుమార్ కంచు కంఠం అంటే తెలుగువారికే కాదు, కన్నడిగులకూ ఎంతో అభిమానం. సాయి కుమార్ గళం నుండి జాలువారే ప్రతిపదం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆయన గాత్రదానంతో ఎంతోమంది స్టార్స్ గా రాణించారు. అనువాద చిత్రాలకు సాయి గళం ఓ పెద్ద ఎస్సెట్. ఇక నటునిగానూ సాయి తనదైన బాణీ పలికించి జనాన్ని ఆకట్టుకున్నారు.

పదహారేళ్ళ ప్రాయంలోనే బాపు తెరకెక్కించిన ‘స్నేహం’లో నటించిన సాయికుమార్ తరువాత తనకు లభించిన ప్రతీపాత్రకు న్యాయం చేస్తూ సాగారు. అదే సమయంలో అనువాద చిత్రాల్లో పలువురు పరభాషా నటులకు తన గొంతు అరువిస్తూ అదరహో అనిపించారు. అనువాద కళాకారునిగానే సాయికుమార్ జనాన్ని మరింతగా ఆకట్టుకోవడం విశేషం.
సాయికుమార్ బాల్యం నుంచీ చిత్రసీమలోనే పెరిగారు అని చెప్పాలి. ఆయన తండ్రి పూడిపెద్ది జోగేశ్వర శర్మ సినిమా రంగంలో పి.జె.శర్మగా సుప్రసిద్ధులు. వందలాది చిత్రాలలో ఆయన నటించారు. పి.జె.శర్మ సైతం తన గాత్రంతో ఎంతోమంది పరభాషా నటుల పెదాల కలయికకు తగ్గ పలుకులు అందించారు. ఇక సాయికుమార్ తల్లి కృష్ణజ్యోతి సైతం కొన్ని సినిమాల్లో నటించారు. ఆ రోజుల్లో ఆమెను అందరూ ఆంధ్రా బినారాయ్ అన్నారు. శర్మను కృష్ణ జ్యోతి పెళ్ళాడాక మళ్ళీ నటించింది లేదు. అలా కన్నవారి ద్వారా జీన్స్ లోనే నటనను నింపుకున్న సాయికుమార్ పదహారేళ్ళ వయసులోనే బాపు ‘స్నేహం’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తరువాత తన దరికి చేరిన ప్రతీపాత్రలో నటించడానికి పరుగు తీశారు. సాయికుమార్ గళ మహిమ కారణంగానే తెలుగు సినిమా రంగంలో సుమన్, రాజశేఖర్ వంటివారు స్టార్స్ గా నిలదొక్కుకున్నారని చెప్పవచ్చు.

మాతృభాష తెలుగులో అంతగా అవకాశాలు రాని సమయాన, 1990ల ఆరంభంలో తమిళ, కన్నడ చిత్రాలవైపూ సాగారు సాయికుమార్. తెలుగులో అనేక చిత్రాలలో నటించినా, సాయికుమార్ కు సరైన బ్రేక్ లభించలేదు. కన్నడ చిత్రసీమలో అనతికాలంలోనే సాయికుమార్ కు హీరో ఇమేజ్ లభించింది. ముఖ్యంగా ‘పోలీస్’ పాత్రలతో కన్నడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు సాయికుమార్. తరువాత తెలుగులోనూ “స్వర్ణముఖి, కొడుకులు, శివన్న, అతను, ఏ.కె.47” వంటి చిత్రాలలో హీరోగా నటించారు. తన తల్లి కృష్ణజ్యోతి పేరుమీద బ్యానర్ నెలకొల్పి, సొంతగా ‘ఈశ్వర్ అల్లా’ చిత్రం నిర్మించారు. ఇవేవీ అంతగా అలరించలేకపోయాయి. దాంతో మళ్ళీ కేరెక్టర్ యాక్టర్ గా మారిపోయారు.

తెలుగునాట వెంటనే కేరెక్టర్ రోల్స్ లోకి పరకాయ ప్రవేశం చేసిన సాయికుమార్, కన్నడలో మాత్రం మరికొంతకాలం హీరోగా అలరించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ఎక్కడ తనకు అవకాశం లభిస్తే అక్కడ తన అభినయంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు సాయికుమార్. విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా సాగిన సాయికుమార్, కొన్ని చిత్రాల్లో కామెడీనీ పండించారు. ఈ మధ్యకాలంలో మాత్రం సాయికుమార్ కేరెక్టర్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ నాట తనకున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ కూడా చేశారు సాయి. 2018లో బీజేపీ అభ్యర్థిగా బాగేపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసిన సాయి ఓటమి చవిచూశారు. అంతకు ముందు కూడా సాయి కర్ణాటక నుండే అసెంబ్లీకి పోటీచేయగా చేదు అనుభవాన్ని చవిచూశారు. ‘సామాన్యుడు’ చిత్రం ద్వారా బెస్ట్ విలన్ గా నందిని సొంతం చేసుకున్న సాయికుమార్, ‘ప్రస్థానం’లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా మరో నందిని అందుకున్నారు.

సాయికుమార్ తమ్ముళ్ళు రవిశంకర్, అయ్యప్ప పి.శర్మ కూడా నటులుగా రాణిస్తున్నారు. వారు కూడా సాయి లాగే డబ్బింగ్ తోనూ అలరిస్తున్నారు. ఇక సాయికుమార్ తనయుడు ఆది నవతరం హీరోగా ఆకట్టుకుంటున్నాడు. సాయి మాత్రం తనకు లభించిన పాత్రలకు న్యాయం చేస్తూ, తనదైన బాణీ పలికిస్తున్నారు.