మెగా ఫ్యామిలీ హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ మూవీతో దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి, హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ తెలుగువారికి పరిచయం అయ్యారు. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు వరుణ్ తేజ్ కష్టపడ్డాడు. అయితే దానికి తగిన ఫలితం మాత్రం దక్కలేదు. ఇటు యూత్ ను, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ సినిమా మెప్పించలేకపోయింది. అదే విషయాన్ని ఇప్పుడు వరుణ్ తేజ్ సైతం అంగీకరించాడు. తాజాగా ఈ మూవీ ఫలితంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేశాడు.
”ఇన్నేళ్ళుగా నా మీద మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ‘గని’ చిత్ర రూపకల్పనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మనసా వాచా మీరంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మరీ ముఖ్యంగా నా నిర్మాతలకు అందుకు ధన్యవాదాలు. ఎంతో మనసు పడి, కష్టపడి ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని మేమంతా పనిచేశాం. కానీ ఎందుకో మా ఆలోచనలు తెర మీద ప్రతిఫలించలేదనిపించింది. నేనెప్పుడు సినిమా చేసినా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే కోరుకుంటాను. కొన్ని సార్లు నేను ఆ విషయంలో విజయం సాధించాను, కొన్నిసార్లు దాని నుండి పాఠాలు నేర్చుకుంటాను. అయితే ఆ ఫలితాలు నేను పడే కష్టంలో ఎలాంటి మార్పు తీసుకురావు” అని వరుణ్ తేజ్ తన మనసులోని మాటను తెలిపాడు.
ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన మీడియా సమావేశంలోనూ తానెంతో ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని, వాటి నుండి కూడా గుణపాఠాలు నేర్చుకున్నానని వరుణ్ తేజ్ చెప్పాడు. చిత్రం ఏమంటే… ‘గని’ కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. ఇక ఇప్పుడు అతని అభిమానులంతా ‘ఎఫ్ 3’ మూవీ మీదనే ఆశలు పెట్టుకున్నారు.
