అలాగ వచ్చి, ఇలాగ ఎగసిపడిన హీరోహీరోయిన్లు ఎందరో ఉన్నారు. వరుణ్ సందేశ్ కెరీర్ ను చూసినా, ఉవ్వెత్తున ఎగసిన కెరటం గుర్తుకు వస్తుంది. తరువాత ఉసూరుమని కూలిన వైనమూ వరుణ్ కెరీర్ లో దాగుంది. అప్పట్లో నవతరం కథానాయకునిగా అలరించిన వరుణ్ సందేశ్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
వరుణ్ సందేశ్ 1989 జూలై 21న ఒరిస్సాలోని రాయగడలో జన్మించాడు. నాలుగేళ్ళు ఇండియాలోనే ఉన్న తరువాత వారి కుటుంబం అమెరికాకు మకాం మార్చింది. అక్కడే వరుణ్ విద్యాభ్యాసం సాగింది. దాంతో వరుణ్ అమెరికన్ ఇండియన్ గా గుర్తింపు సంపాదించాడు. ప్రముఖ తెలుగు రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవడు వరుణ్ సందేశ్. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘హ్యాపీ డేస్’లో నటీనటులు కావలెను అని తెలిసి, వరుణ్ సందేశ్ అప్లై చేశాడు. లక్కీగా వరుణ్ కు అందులో హీరోగా నటించే అవకాశం లభించింది. ‘హ్యాపీ డేస్’ సినిమా టైటిల్ కు తగ్గట్టే అందులో నటించిన పలువురి జీవితాలలో ఆనందం నింపింది. అందులో వరుణ్, హీరోయిన్ తమన్నా ముందుగా హ్యాపీ డేస్ చూశారు. ‘హ్యాపీ డేస్’ గ్రాండ్ సక్సెస్ తో వరుణ్ సందేశ్ కు మంచి ఆదరణ లభించింది. తరువాత దిల్ రాజు నిర్మించిన ‘కొత్త బంగారులోకం’ కూడా ఘనవిజయం సాధించడంతో వరుణ్ కాల్ షీట్స్ కు క్రేజ్ పెరిగింది. ఆ పై “ఎవరైనా ఎపుడైనా, కుర్రాడు, మరో చరిత్ర, హ్యాపీ హ్యాపీగా…, ఏమైంది ఈ వేళ” వంటి చిత్రాలలో నటించాడు వరుణ్. వీటిలో ‘ఏమైంది ఈ వేళ’ జనాన్ని ఆకట్టుకుంది. అయితే ఆరంభంలో లభించిన ఘనవిజయాల స్థాయిలో మళ్ళీ వరుణ్ సందేశ్ కు ఇప్పటి దాకా సక్సెస్ లభించలేదు.
“పాండవులు పాండవులు తుమ్మెద, మామ మంచు – అల్లుడు కంచు, నువ్వు తోపురా…” వంటి చిత్రాలలో కామెడీ పండించాడు వరుణ్. ఈ యేడాది ఆరంభంలోనే వరుణ్ సందేశ్ నటించిన ‘ఇందువదన’ విడుదలయింది. ఆ సినిమా సైతం వరుణ్ కు ఆశించిన సక్సెస్ ను అందించలేకపోయింది. 2019 ‘బిగ్ బాస్’లో థర్డ్ రన్నరప్ గా నిలిచాడు వరుణ్. ఏది ఏమైనా వరుణ్ కొన్ని పాత్రలకు పనికి వస్తాడు అని భావించేవారు ఇప్పటికీ ఆయనకు అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. వరుణ్ సందేశ్, నటి వితికా షేరును పెళ్ళాడాడు. మళ్ళీ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న వరుణ్ సందేశ్ కు ఏ సినిమా ఆ అవకాశం అందిస్తుందో చూడాలి.
