మధురగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తరువాత తెలుగు చిత్రసీమలో టాప్ స్టార్స్ కు కొంత సంకట పరిస్థితి ఎదురయింది. ఎందుకంటే అప్పటి దాకా యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ ఘంటసాల నేపథ్యగానంతోనే అపూర్వ విజయాలు చూశారు. ఘంటసాల లేని లోటు తీర్చలేనిది. అయితే ఆయనలాగే పాడే రామకృష్ణ దొరకడంతో యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలు ఆయన పాటతో కొంతకాలం సాగాయి. శోభన్ బాబు, కృష్ణంరాజు వంటివారు కూడా సీనియర్స్ బాటలో నడుస్తూ రామకృష్ణ నేపథ్యగానంతో పయనించారు. ఆ తరువాత కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు పాడటం కోసం అదే పనిగా రామకృష్ణనే ఎంచుకున్నవారు ఉన్నారు. అలా తన గాత్రంతో ప్రత్యేకంగా నిలిచారు రామకృష్ణ.
విస్సంరాజు రామకృష్ణ 1947 ఆగస్టు 20న విజయనగరంలో జన్మించారు. మధురగాయని పి.సుశీలకు స్వయానా అక్కకొడుకు రామకృష్ణ. వారి వంశంలోనే సంగీతాభిలాష ఉంది. అలా రామకృష్ణ సైతం సంగీతసాధన చేశారు. తమ ప్రాంతానికే చెందిన ఘంటసాల అంటే రామకృష్ణకు ఎంతో అభిమానం. ఆయన పాడిన పాటలనే అభ్యసిస్తూ సంగీతంలో పట్టు సాధించారు రామకృష్ణ. బి.యస్సీ, పూర్తయిన తరువాత తానూ ఘంటసాల లాగా గాయకుడు కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతంలో గళం వినిపించారు. అదే సమయంలో దుక్కిపాటి మధుసూదనరావు ‘విచిత్రబంధం’ నిర్మిస్తున్నారు. ఇందులో ఏయన్నార్ కు రెండు పాటలను రామకృష్ణతో పాడించారు. రామకృష్ణ పేరు వినగానే ఈ నాటికీ ‘విచిత్రబంధం’లో ఆయన సోలోగా పాడిన “చిక్కావు చేతిలో చిలకమ్మా…” పాటనే గుర్తు చేసుకుంటారు జనం. ఆ పై యన్టీఆర్ కు ‘ధనమా? దైవమా?’ చిత్రంలో తొలిసారి పాడారు రామకృష్ణ.
యన్టీఆర్ అభినయానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానానికి లంకె కుదిరింది. అయినా యన్టీఆర్ , రామకృష్ణను ప్రోత్సహిస్తూ ఏదో ఒక విధంగా పాడించేవారు. ముఖ్యంగా తన ‘దానవీరశూర కర్ణ’లో శ్రీకృష్ణుని పాత్రకు రామకృష్ణతోనే గానం చేయించారు. దాంతో పద్యాలకు రామకృష్ణనే న్యాయం చేయగలరు అనే పేరు లభించింది. ఆ తరువాత కూడా యన్టీఆర్ ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’లో తత్వాలు, పద్యాలు రామకృష్ణతోనే పాడించారు. ఆ సినిమాతో రామకృష్ణ పని అయిపోయిందని భావించినవారు సైతం ముక్కున వేలేసుకున్నారు. బాలు, రామకృష్ణ కలసి అనేక చిత్రాలలో పాడి అలరించారు. వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండేది. తరువాతి రోజుల్లో అందరు హీరోలు బాలు గానంతోనే సాగినా, కొన్ని ప్రత్యేక గీతాలకు సంగీత దర్శకులు రామకృష్ణనే ఎంచుకొనేవారు. రామకృష్ణ భార్య జ్యోతి ఖన్నా కూడా గాయని. ఆమె కూడా కొన్ని చిత్రాలలో పాడారు. రామకృష్ణ, జ్యోతి కలసి తెలుగునేలపై అనేక పర్యాయాలు పాటల పందిళ్ళు వేసి అలరించారు.
రామకృష్ణ తరువాత కొన్ని చిత్రాలలో నటించారు. ఆయన తనయుడు సాయి కిరణ్ హీరోగా సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ మురిపించాడు. 2015 జూలై 16న రామకృష్ణ కన్నుమూశారు. ఇప్పటికీ రామకృష్ణ పేరు వినగానే ఆయన పాడిన ఆ నాటి మధురగీతాలు, పద్యాలు మన మదిలో మెదలక మానవు.
