Unni Mukundan: తెలుగులో పలు చిత్రాలలో భిన్నమైన పాత్రలను చేసి ఇక్కడి వారికీ చేరువయ్యాడు ఉన్ని ముకుందన్. తాజాగా అతను నటించిన మలయాళ చిత్రం ‘మాలికా పురం’ వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి, అతని కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ కాస్తంత ఆలస్యంగా డబ్ అయ్యి, విడుదలైంది. విశేషం ఏమంటే… ఇప్పుడు ఉన్ని ముకుందన్ పాన్ ఇండియా మూవీ ఒకటి చేయబోతున్నాడు. ‘గంధర్య జూనియర్’ పేరుతో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన గత యేడాది సెప్టెంబర్ 22న ఉన్ని ముకుందన్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చింది.
తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. మలయాళంతో పాటు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నానట. ఈ ఫాంటసీ డ్రామా మూవీని అరవింద్ విష్ణు డైరెక్ట్ చేస్తుండగా, ప్రవీణ్ ప్రభాకరన్, సుజిన్ సుజాతన్ రచనా సహకారం అందిస్తున్నారు. మలయాళంలో ఆ మధ్య వచ్చిన సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళీ’ ఘన విజయం తర్వాత తెరకెక్కుతున్న మరో సూపర్ హీరో మూవీ ఇదేనని అక్కడి సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘మాలికాపురం’ విజయంతో ఈ సినిమా మీదా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని అందుకోవడానికి చిత్రబృందం ఎలాంటి కృషి చేస్తుందో చూడాలి.
