మృత్యువు ఎప్పుడు.. ఏ రూపం లో వస్తుందో ఎవ్వరం చెప్పలేము. చుట్టూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం.. తమ పని తాము చేసుకొని వెళ్లిపోవాలనుకొనే వ్యక్తులు.. కొద్దిసేపు ఉంటే ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయేవారు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో మృత్యువు చేతికి చిక్కారు. ఇంతకీ ఎవరు వారు అంటే.. ఇద్దరు హీరోలు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ సిరీస్ ‘ది చూసెన్ వన్’. బ్రెజిలియన్ థ్రిల్లర్ సిరీస్ గా 2019 లో రిలీజైన ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకొంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ వరుస సీజన్లను రిలీజ్ చేస్తూ వచ్చింది. ఈ మధ్యనే రెండో సీజన్ కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకోగా వెంటనే మూడో సీజన్ షూటింగ్ ను మొదలుపెట్టారు.
భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండే సిరీస్ కాబట్టి బాజా కాలిఫోర్నియా సమీపంలోని శాంటా రోసాలియా ఎడారి ప్రాంతంలో షూటింగ్ మొదలుపెట్టారు. అయితే షూటింగ్ జరుగుతున్న పక్కన ఒక రోడ్ ఉంది.. జూన్ 16 గురువారం షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఎడారి ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వ్యాన్ పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్‌లోకి దూసుకువెళ్లింది. ఆ వ్యాన్ షూటింగ్ సెట్ లో ఉన్న నటులు రేముండో గుర్డానో, జువాన్ ఫ్రాన్సిస్కో అగ్యిలర్ తో పాటు మరో ఆరుగురిని పైన పడింది. ఈ అనుకోని సంఘటనకు అవాక్కయిన చిత్ర బృందం వెంటనే తేరుకొని చూసేసరికి ఇద్దరు నటులు మృత్యువాత పడగా ఆరుగురు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. అయితే ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్నీ ప్రస్తావించకపోవడం విశేషం.. దీంతో నెట్‌ఫ్లిక్స్ పై బ్రెజిల్ మీడియా, అభిమానులు మండిపడుతున్నారు.
