Tripuraneni Maharathi:త్రిపురనేని మహారథి మాటలు పలు సినిమాలకు కోటలు కట్టి, విజయాలకు బాటలు వేశాయి. తన రచనతో కొత్త పుంతలు తొక్కాలని నిత్యం తపించేవారు మహారథి. ప్రపంచ సినిమాను అధ్యయనం చేసి, ఆ పోకడలను తెలుగు చిత్రాల్లోనూ ప్రవేశ పెట్టాలని భావించేవారు. ఆయన అభిరుచికి తగ్గ నిర్మాతలు, దర్శకులు లభించినప్పుడు తాను కోరుకున్న విధంగా రచన సాగించి అలరించారు మహారథి. అందువల్లే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మహారథి. సరస్వతీ కటాక్షం లభించడంతో ఆయనలో విద్యాగర్వం చాలా ఉండేది. ఏ తరహా కథకైనా ఇట్టే రచన చేసి, జనం మెచ్చేలా చేయగలనని గర్వంగా చెప్పుకొనేవారు మహారథి. బాలకృష్ణ హీరోగా భారీ జానపదాన్ని భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఎస్.గోపాల్ రెడ్డి ప్రారంభించినప్పుడూ అదే మాట అన్నారు. ఆ కథకు తాను తప్ప మరొకరు న్యాయం చేయలేరని చెప్పేవారు. అనివార్య కారణాలవల్ల ఆ కథ కొంత షూటింగ్ జరుపుకొని అటకెక్కింది. అయితే మహారథి పేరు చెప్పగానే ఆ తరం వారికి ఆయన రచనలో రూపొందిన అనేక చిత్రాలు గుర్తుకు వస్తాయి. వాటిలో మరపురానిది, తెలుగువారు మరచిపోనిది అయిన కృష్ణ నూరవ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అన్నిటికన్నా మిన్న!
త్రిపురనేని మహారథి 1930 ఏప్రిల్ 20న పసమర్రులో జన్మించారు. బాల్యం నుంచీ చదువంటే ఆయనకు మహా ఇష్టం. దొరికిన ప్రతీపుస్తకాన్ని చదివేసేవారు. త్రిపురనేని రామస్వామి ప్రభావం ఆయనపై ఉండేది. అందువల్ల తనకు అనుమానం కలిగిన అంశానికి హేతువును వెదికేవారు మహారథి. బ్రతుకు తెరువు కోసం రాజధాని నగరం చేరిన మహారథికి, హైదరాబాద్ లో పలు ఇంగ్లిష్, హిందీ చిత్రాలు చూసే అవకాశం లభించింది. సొంతగా పలు రచనలు చేశారు. సినిమా రంగంవైపు మనసు మళ్ళింది. రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ అధినేతలు సుందర్ లాల్ నహతా, డూండీని కలుసుకున్నారు. అప్పట్లో వారి సినిమాలకు పనిచేస్తున్న వి.మధుసూదనరావు కూడా మహారథిలోని ప్రతిభను ఇట్టే కనిపెట్టేశారు. దాంతో ఆ సంస్థలో రచనావిభాగంలో కుదురుకున్నారు. అక్కడ పనిచేస్తూనే అవకాశాలు లభించిన వాటికి రచన చేశారు. అయితే ఆయనకు రచయితగా మంచి పేరు సంపాదించి పెట్టింది రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ యన్టీఆర్ తో నిర్మించిన ‘బందిపోటు’ చిత్రమే! యన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రంగా ‘బందిపోటు’ వెలుగు చూసింది. ఇందులో ఎమోషన్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ తనదైన రీతిలో పలికించారు మహారథి. ఆ తరువాత యన్టీఆర్ కు సన్నిహితులయ్యారు. రామారావుకు ఆత్మీయులైన యు.విశ్వేశ్వరరావు సంస్థలో చేరారు. యన్టీఆర్ తో విశ్వేశ్వరరావు నిర్మించిన “కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందార్లు” వంటి చిత్రాలకు రచన చేశారు మహారథి. యన్టీఆర్ తో విశ్వేశ్వరరావు నిర్మించిన ‘దేశోద్ధారకులు’కు మాటలు రాసే సమయంలోనే హీరో కృష్ణ క్యాంప్ లో చేరారు మహారథి. యన్టీఆర్ తో కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’కు కూడా మహారథి రచన ఎంతగానో అలరించింది. ఆ తరువాత కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం తలపెట్టారు. దానికి స్క్రిప్ట్ రాయడం ఓ తపస్సులా భావించి పూర్తి చేశారు. నిజానికి అల్లూరి వారి పేరు సీతారామరాజు. కానీ, సినిమా కోసం అన్నట్టు సీత అనే ప్రేయసి ఉన్నట్టు, ఆమె పేరునే తన నామంలో జోడించుకున్నట్టు మహారథి కల్పితం చేశారు. ఆ కల్పితమే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగువారి తొలి సినిమాస్కోప్ రంగుల చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’ భారీ విజయం నమోదు చేసింది. ఇందులోని సంభాషణలు జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
‘అల్లూరి సీతారామరాజు’ తరువాత కృష్ణ క్యాంప్ లోనే సాగిన మహారథి ఆ పై “పాడిపంటలు, కురుక్షేత్రం, అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీమ్, హేమాహేమీలు, ప్రజారాజ్యం, సింహాసనం, శాంతి సందేశం” వంటి చిత్రాలకు రచన చేశారు. వీటన్నిటా కృష్ణ కథానాయకుడు కావడం విశేషం! “దేశమంటే మనుషులోయ్, భోగిమంటలు, రైతుభారతం, మంచినిపెంచాలి” వంటి చిత్రాలకు రచన చేయడమే కాదు నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు మహారథి.
రాజకీయాలంటే మహారథికి ఎంతో అభిమానం. ఎందుకంటే ‘ప్రజల కోసం ప్రజల వలన అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని’ ఆయన అభిమానించేవారు. భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత ఎంతైనా ఉందని మహారథి అనేవారు. అప్పటికే యన్టీఆర్ వర్గం ఆయనను దూరంగా పెట్టినా, యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ స్థాపించినప్పుడు తప్పకుండా ఆయన ఘనవిజయం సాధిస్తారు అని చాటింపు వేశారు మహారథి. తరువాత కాంగ్రెస్ పార్టీలోనూ ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. రామారావు అధికారంలో ఉన్న సమయంలో కృష్ణ వర్గం ఆయనకు వ్యతిరేకంగా రూపొందించిన చిత్రాల వెనుక మహారథి హస్తం కూడా ఉంది. అయితే యన్టీఆర్ ను మహానటునిగా కీర్తించడంలో మహారథి ఏ నాడూ సంకోచించేవారు కారు. సదా తాను అన్నగారి అభిమానినే అనేవారు. మహారథి తనయుడు త్రిపురనేని చిట్టి కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిట్టి బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు. ఏది ఏమైనా తెలుగునాట రచయితగా తనదైన బాణీ పలికించారు మహారథి. ఇందులో ఏలాంటి సందేహం లేదు. 2011 డిసెంబర్ 23న మహారథి తుదిశ్వాస విడిచారు.