‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్‌తో పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య గతనెల 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఆయిన ఈ సినిమా తొలి ఆటనుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాలలోను ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బయ్యర్స్ కు భారీ నష్టాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ వ్యవహారంలో చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోవడం డిజిటల్ డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
సినిమా విడుదలకు ముందు ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి దాదాపు రూ. 150 కోట్లకు పైగా ఆఫర్లు వచ్చినట్లు టాక్ నడిచింది. అయితే మేకర్స్ అంతకంటే ఎక్కువ ఆశించడంతో అప్పట్లో ఆ డీల్స్ ఓకే కాలేదు. కానీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత వచ్చిన డిజాస్టర్ టాక్, ఆశించిన స్థాయిలో వసూళ్లు లేకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ప్రస్తుతం ఫిలిం నగర్ అంచనాల ప్రకారం ప్రముఖ డిజిటల్ సంస్థ జీ స్టూడియోస్ మాత్రమే ఈ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆఫర్ మొత్తం కేవలం రూ. 30 కోట్లకు పరిమితం కావడంతో మేకర్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆశించిన స్థాయి కంటే డిజిటల్ మార్కెట్లో భారీగా ధర పడిపోవడం ట్రేడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

