Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!

Top 7 Indian Sequels 300kb

Top 7 Indian Sequels 300kb

Top 7 Indian Sequels: ఇటీవల ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్స్ అసాధారణమైన రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’, ‘కేజీఎఫ్ 2’ వంటి సినిమాలు ఇప్పటికే తమ సత్తా నిరూపించాయి. ఇప్పుడు 2026లో ఆ రికార్డు రేసులో మరో సినిమా ఏకంగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో ఈ సినిమాలు సీక్వెల్ అంటే అదేదో రెండో పార్ట్ మాత్రమే కాదని, అది ఒక పెద్ద బాక్సాఫీస్ ఈవెంట్‌గా మారగలదని నిరూపించాయి.

‘ధురంధర్ 2: ది రివెంజ్’

ఈ జాబితాలో ప్రస్తుతం మొదటి స్థానంలో నిలిచింది రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,852 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు బాక్సాఫీస్ ట్రాకర్లలో నమోదైంది. ఈ వసూళ్లతో ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ను వెనక్కి నెట్టి అత్యధిక వసూళ్లు సాధించిన సీక్వెల్‌గా నిలిచింది.

‘బాహుబలి 2: ది కంక్లూజన్’

రెండో స్థానంలో ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 2017లో విడుదలై ఇండియన్ సినిమా మార్కెట్‌ను పూర్తిగా మార్చేసింది. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ఒక్క ప్రశ్న సినిమాకి ఓ రేంజ్ హైప్ ఇచ్చింది. రిలీజ్ తరువాత కథ, యాక్షన్, విజువల్స్, ఎమోషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,810 కోట్లకు పైగా వసూలు చేసి చాలా కాలం పాటు ఇండియన్ సీక్వెల్స్‌లో నంబర్ వన్‌గా కొనసాగింది.

‘పుష్ప 2: ది రూల్’

మూడో స్థానంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా వచ్చింది. పుష్పరాజ్ పాత్రకు అల్లు అర్జున్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్, పాటలు, పాన్ ఇండియా ప్రమోషన్స్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,800 కోట్ల స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా భారతీయ సినిమా సీక్వెల్స్‌లో టాప్ 3లో నిలిచింది.

‘కేజీఎఫ్: చాప్టర్ 2’

నాలుగో స్థానంలో యష్ నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రాకీ భాయ్ కథను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ తర్వాత రాకీ భాయ్ పాత్రకు దేశవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్, భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్, యష్ మాస్ ఇమేజ్‌తో సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఈ చిత్రం రూ.1,200 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లు సాధించింది.

‘స్త్రీ 2’

ఐదో స్థానంలో మాత్రం పూర్తిగా భిన్నమైన జానర్‌కు చెందిన ‘స్త్రీ 2’ నిలిచింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ హారర్ కామెడీ భారీ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వసూళ్లు సాధించింది. 2018లో వచ్చిన ‘స్త్రీ’కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫ్రాంచైజీ క్యారెక్టర్లను విజయవంతంగా కలిపింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలే భారీ వసూళ్లు సాధిస్తాయనే అంచనాలను మార్చిన చిత్రాల్లో ‘స్త్రీ 2’ కూడా ఒకటిగా నిలిచింది. ఇది 858 కోట్లు వసూలు చేసి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

‘రోబో 2.0’

ఆరవ స్థానంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘రోబో 2.0’ ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం రజనీకాంత్‌తో పాటు అక్షయ్ కుమార్‌ను కీలక పాత్రలో చూపించింది. 2010లో వచ్చిన ‘రోబో’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, 3డీ టెక్నాలజీ, భారీ యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ సుమారు రూ.690 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారీ తమిళ చిత్రంగా నిలిచింది.

‘గదర్ 2’

ఏడో స్థానంలో సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ ఉంది. 2001లో వచ్చిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తారా సింగ్ పాత్రను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. సన్నీ డియోల్ మాస్ ఇమేజ్, దేశభక్తి అంశాలు కలవడంతో ‘గదర్ 2’ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ప్రభావం చూపించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యంత విజయవంతమైన హిందీ సీక్వెల్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఇప్పడు చాలా మంది దర్శకులు ఇలాంటి విజయాలను చూసి సీక్వెల్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలకు భవిష్యత్తులో కూడా సీక్వెల్స్‌కు భారీ మార్కెట్ కనిపిస్తోంది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఉంటేనే అవి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ హిట్ సీక్వెల్స్ వెనుక దర్శకులు, టెక్నీషియన్స్ విశేష ప్రతిభను కూడా గుర్తుంచుకోవాలి.