Site icon NTV Telugu

Tom Cruise: టామ్ క్రూయిజ్ తడాఖా చూపిస్తాడా!?

Tom

Tom

Tom Cruise:టామ్ క్రూయిజ్ అనగానే ఆయన నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ ముందుగా గుర్తుకు వస్తాయి. ఇప్పటికి ‘మిషన్ ఇంపాజిబుల్’ ఆరు భాగాల్లో అలరించిన టామ్ ఈ సారి ఏడో భాగం ‘మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్’ తో జనం ముందుకు వస్తున్నారు. విశేషమేమంటే, ఇప్పుడు రాబోయేది ‘మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్’లో పార్ట్ వన్. అంటే మరో భాగం ‘డెడ్ రెకనింగ్ -2’ ఉందన్న మాట! ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. అలా వచ్చిందో లేదో ఇలా టామ్ అభిమానులను, యాక్షన్ మూవీస్ ఫ్యాన్స్ ను అలరిస్తూ సాగుతోంది ‘మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ పార్ట్ 1’ ట్రైలర్!

‘మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ పార్ట్ వన్’ చిత్రాన్ని క్రిష్టఫర్ మెక్కోరీ నిర్మించి, దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్ – ఫాల్ ఔట్’కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ చూస్తోంటే ఇందులోనూ గగుర్పొడిచే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ మొదట్లోనే బైక్ మీద టామ్ క్రూయిజ్ వేగంగా వెళ్ళి ఒక కొండ అంచుకు చేరుకొని సడెన్ బ్రేక్ వేస్తారు. ఆ చివర నుండి చూస్తే కింద పాతాళాన్ని తలపించే లోయ ఉంటుంది. ఎడారిలో గుర్రాలపై ఛేజింగ్, కొండపై నుండి లోయలోకి బైక్ తో దూకే సీన్, తరువాత ట్రెయిన్ ఫైట్, పై నుండి ట్రెయిన్ నీటిలో పడడం వంటి సీన్స్ చూస్తే యాక్షన్ ప్రియులకు భలే కనువిందు అనే చెప్పాలి. అయితే ఇలాంటి సీన్స్ ఒకప్పుడు హాలీవుడ్ కే సాధ్యమనిపించేవి. ఈ మధ్య వస్తున్న మన స్టార్ హీరోస్ సినిమాల్లోనూ, మొన్న వచ్చిన షారుఖ్ ‘పఠాన్’లోనూ కొన్ని సీన్స్ ఇలాగే అనిపిస్తాయి. అందువల్ల అంతా ‘గ్రాఫిక్స్ మాయాజాలం’ అని కొట్టి పడేసేవారుంటారు. అయితే టెక్నాలజీని కథను నడిపించడానికి అనువుగా ఉపయోగించుకొనే హాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్- డెడ్ రెకనింగ్ పార్ట్ వన్’ను కూడా అలాగే తీర్చిదిద్దిందని కొందరి మాట! ఎవరి మాట ఎలా ఉన్నా, ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ ఇప్పటి దాకా జనాన్ని అలరిస్తూనే వస్తోంది. జూలై 12వ తేదీన ఈ చిత్రం జనం ముందుకు రానుంది. దీని తరువాతి భాగం అంటే ‘మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ పార్ట్ టూ’ సినిమా 2024 జూన్ 28న వెలుగు చూడనుంది. మరి ఈ సినిమాలు యాక్షన్ మూవీ బఫ్స్ ను ఏ తీరున ఆకట్టుకుంటాయో చూడాలి.

Exit mobile version