ఇటీవల కాలంలో సినిమాలు విడుదలై రెండువారాలకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. అవి చిన్న సినిమాలు అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఏకంగా స్టార్ హీరోల సినిమాలకే ఇలా జరుగుతోంది. అయితే ఓటీటీలో పే ఫర్ వ్యూ లెక్కన రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలకు సరైన స్పందన కూడా రావటం లేదన్నది వేరే సంగతి. అయితే ఈ ట్రెండ్ థియేటర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నది మెల్లమెల్లగా అందరికీ అర్థం అవుతోంది.
అసలే స్టార్ హీరోల సినిమాలకు రేట్లు పెంచి తమకు తాము దెబ్బవేసుకున్న నిర్మాతలు ఇప్పుడు ఓటీటీలో వెంటనే రిలీజ్ చేస్తుండటంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పు వచ్చింది. అంత రేటు పెట్టి థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడవలసిన అవసరం ఏముందిలే అనే ఆలోచనతో పాటు రెండు, మూడు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు ఇంటిల్లిపాది హాయిగా చూడవచ్చు అనే ఫిక్స్ అయిపోతున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు విడుదలైన తొలి నాళ్ళలో సినిమా చూడాలంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకూ ఒక్కో టిక్కెట్ కు వెచ్చించవలసిన అవసరం పడుతోంది. అదే ఫ్యామిలీతో కలసి చూడాలంటే వెయ్యి నుంచి రెండు వేల వరకూ ఖర్చు పెట్టవలసి వస్తోంది. అదే ఓటీటీలో పే ఫర్ వ్యూ పెట్టినా 75రూ నుంచి 200రూ లోపే వెచ్చించి హాయిగా ఇంటిల్లి పాది చూడవచ్చనే నిర్ణయానికి వచ్చేశారు. అదే ఓటీటీలో మరో వారం ఆగితే సబ్ స్క్రిక్షన్ ఉంటే ఫ్రీగా కూడా చూడవచ్చని భావించి చాలా మంది థియేటర్లవైపు తొంగి కూడా చూడటం లేదు.
ఇది గమనించే దిల్ రాజు వంటి నిర్మాతలు ‘ఎఫ్3’కి స్టార్ కాస్ట్ ఉన్నా కూడా టిక్కెట్ రేటు పెంచలేదంటూ ప్రచారం చేసుకుని కొంత వరకూ సక్సెస్ అయ్యారు. ఆయన బాటలోనే మరి కొందరు పయనిస్తున్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓనర్ అయిన అల్లు అరవింద్ సైతం సినిమా రిలీజ్ కు ఓటీటీలో విడుదలకు రెండు నెలల గ్యాప్ ఇస్తున్నామని, అలా ఇవ్వని పక్షంలో సినిమా మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేశాడు. ఇక ఈ వారంలో విడుదల కాబోతున్న నాని సినిమా ‘అంటే సుందరానికి’ కూడా త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్నదంటూ ప్రచారం జరిగింది. ఏమయిందో ఏమో కానీ నాని కలగజేసుకుని అలాంటిదేమీ లేదని ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తేల్చేశాడు. నిర్మాతలు ఎలాంటి ప్రకటనా ఇవ్వనప్పటికీ ఇలా త్వరలో ఓటీటీలో వస్తుందంటే కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా థియేటర్లలో ఎలాంటి సందడి ఉండదన్నది టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలకు అవగతం అవుతోంది. వారి ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది. సినిమా రిలీజ్ కు ఓటీటీ రిలీజ్ కు రెండు నెలల గ్యాప్ ఉండాలనే అంత మదనం మొదలైంది. మార్పు మంచిదే… ఇదే ఊపులో సినిమాల బడ్జెట్ విషయంలోనూ ఆలోచనలు పెరిగి పారితోషికాలు, ఖర్చులు తగ్గించుకుని బడ్జెట్ కూ కోతలు పెట్టుకుంటే మళ్ళీ చిత్రపరిశ్రమ కళకళలాడుతుంది. థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతాయి. ఆ దిశగా అడుగులు వేస్తారా! వేయాలని కోరుకుందాం.
