టాలీవుడ్ మళ్లీ డ్రగ్స్ కేసుతో కుదిపేస్తోంది. డ్రగ్స్ కొనుగోలు, సప్లై వ్యవహారంలో ప్రముఖ సినీ నటులు శ్రీరామ్ (శ్రీకాంత్), కృష్ణ పేర్లు బయటకు రావడంతో సంచలనం రేగింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వీరిద్దరికీ సమన్లు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. గత జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసినందుకు జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతని వద్ద నుంచి లభించిన వివరాల ఆధారంగా, ఈ డ్రగ్స్ రాకపోకలలో కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఆ జాబితాలో శ్రీకాంత్, కృష్ణ పేర్లు ఉండటంతో, ఈడీ వీరి ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తోంది. ఈ కేసు ఇటీవల ED పరిధిలోకి చేరడంతో, శ్రీకాంత్‌ను ఈ నెల 28న, కృష్ణను 29న విచారణకు హాజరుకావాలని అధికారికంగా నోటీసులు జారీ చేసింది. వీరి సమాధానాల ఆధారంగా మరికొందరిపై కూడా విచారణ జరగొచ్చని సమాచారం. ఇక టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ ఇష్యూ బహిర్గతం కావడంతో సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు హీరోలు, టెక్నీషియన్లు, మేనేజర్లు ఈ కేసులో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు నటులపై ఈడీ దృష్టి పడటంతో పరిశ్రమలో టెన్షన్ పెరిగింది.
