NTV Telugu Site icon

RajyaSabha: రాజ్య‌స‌భ‌లో తెలుగు సినీజ‌నం!

Tollywood

Tollywood

తెలుగు సినిమారంగంలో విశేష‌ఖ్యాతిని ఆర్జించిన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్, వంద‌లాది చిత్రాల‌కు స్వ‌ర‌క‌ల్ప‌న చేసిన ఇళ‌య‌రాజా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కావ‌డం ప‌ట్ల యావ‌ద్భార‌తీయ సినిమా రంగంలో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇళ‌య‌రాజా త‌మిళ‌నాడు నుండి నామినేట్ అవుతూ ఉండ‌గా, తెలుగునేల నుండి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ నామినేట్ కావ‌డం విశేషం! రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టిన తొలి సినిమా రంగం మ‌నిషిగా రావు గోపాల‌రావు నిలిచారు. య‌న్టీఆర్ ముఖ్య‌మంత్రి కాగానే ఆయ‌న రావు గోపాల‌రావును రాజ్య‌స‌భ‌కు పంపారు. ఆయ‌న త‌రువాత తెలుగుదేశం పార్టీ నుండి జ‌య‌ప్ర‌ద‌, హ‌రికృష్ణ కూడా రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టారు.

ఇక ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు రెండు సార్లు నామినేట్ అయ్యారు. కేంద్రంలో బొగ్గు, గ‌నుల శాఖ స‌హాయ మంత్రిగానూ ఆయ‌న ప‌నిచేశారు. బీజేపీ త‌ర‌పున డాక్ట‌ర్ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు (`స‌త్యం-శివం` నిర్మాత‌) అప్ప‌ట్లో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్ర‌ముఖ నిర్మాత టి.సుబ్బ‌రామిరెడ్డి కూడా రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టిన‌వారే. ఈయ‌న మూడు ప‌ర్యాయాలు రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఉన్నారు. కేంద్ర‌మంత్రిగానూ ప‌నిచేశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కాంగ్రెస్ పార్టీలో త‌న `ప్ర‌జారాజ్యం` పార్టీని విలీనం చేసి, ఆ త‌రువాత రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు.

కాంగ్రెస్, మిత్ర‌ప‌క్షాల‌తో అధికారంలోఉన్న స‌మయంలో చిరంజీవి కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగానూ వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌ముఖ దిన ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి ప‌బ్లిష‌ర్, ల‌క్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూష‌న్స్ అధినేత అయిన కె.య‌ల్.య‌న్ ప్ర‌సాద్ కూడా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టిన‌వారే. ఇక క‌ళాకారుల కోటాలో డాక్ట‌ర్ సి.నారాయ‌ణ రెడ్డి సైతం రాజ్య‌స‌భ‌లో త‌న వాణి వినిపించారు. మ‌రి తాజాగా రాజ్య‌స‌భ స‌భ్యుడు కాబోతున్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ పెద్ద‌ల స‌భ‌లో ఏ తీరున అల‌రిస్తారో చూడాలి.