Site icon NTV Telugu

Tollywood: ఈ వీకెండ్ 7 తెలుగు సినిమాలు!

Movies This Week

Movies This Week

జూలై నెల తెలుగు నిర్మాతలకు చుక్కలు చూపించింది. ఆ నెలలో ఏకంగా 31 సినిమాలు విడుదల కాగా, ఒక్కటంటే ఒక్కటి కూడా విజయానికి నోచుకోలేదు. తీవ్ర నిరాశకు గురైన తెలుగు నిర్మాతలు కొందరు షూటింగ్స్ కూడా బంద్ చేసి, తమ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పుడిప్పుడే ఆ చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయి. నిర్మాతల్లోని నిరాశ, నిస్పృహలను పారద్రోలుతూ ఆగస్ట్ మొదటి రెండు వారాల్లో మూడు సినిమాలు చక్కని విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆగస్ట్ 5న విడుదలైన ‘సీతారామం, బింబిసార’ చిత్రాలు అనూహ్య విజయాన్ని అందుకున్నాయి. గత శనివారం వచ్చిన ‘కార్తికేయ -2’ ఈ విజయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మూడో వారం విడుదల కాబోతున్న సినిమాలపై అందరూ దృష్టి పెట్టారు. అయితే… ఈ వీకెండ్ లో అంత ప్రామిసింగ్ మూవీస్ ఏవీ జనం ముందుకు రావడం లేదు.

ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రన్బలం’ ఈ నెల 18న విడుదల అవుతోంది. చిత్రం ఏమంటే… ఎలాంటి హడావుడీ, హంగామా లేకుండా ఈ మూవీని తెలుగులోనూ ‘తిరు’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. ధనుష్ కు ఇప్పుడు తెలుగులోనూ కొద్దోగొప్పో మార్కెట్ ఉంది. పైగా అతను తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీలోనూ నటిస్తున్నాడు. అలాంటి సమయంలో ‘తిరు’ చిత్రాన్ని ఎలాంటి హైప్ లేకుండా మేకర్స్ రిలీజ్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తమిళం సినిమా హిట్ అయితే… ఒకటి రెండు వారాలు ఆలస్యంగానైనా ఇక్కడ రిలీజ్ చేయొచ్చు. కానీ ఎలాంటి ప్రచార ఆర్బాటాలు లేకుండా విడుదల చేసేసి చేతులు దులిపేసుకోవాలని నిర్మాతలు ఎందుకు భావిస్తున్నారో ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.

ఫ్రైడే వస్తున్న స్ట్రయింట్ తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గది ఆది సాయికుమార్ నటించిన ‘తీస్ మార్ ఖాన్’. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమా నిర్మించారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇందులో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను ఆది సాయికుమార్ పోషించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మించిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సునీల్, అనసూయ, సుడిగాలి సుధీర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాతో రచయిత శ్రీధర్ సీపాన డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.’శుక్ర’ ఫేమ్ సుకు పూర్వాజ్ డైరెక్ట్ చేసిన ‘మాటరాని మౌనమిది’ కూడా శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ లవ్ స్టోరీలో మహేష్ దత్త, శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ హీరో ,హీరోయిన్లుగా నటించారు. అలానే సుధాకర్, లావణ్య జంటగా నటించిన ‘అం అః’ చిత్రం, లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ‘కమిట్ మెంట్’ మూవీ కూడా ఫ్రైడే రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆరు సినిమాలతో పాటే ఈ నెల 19న ఆనంద్ దేవరకొండ నటించిన ‘హైవే’ మూవీ ఆహాలో డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతోంది. సో… భిన్న కథాంశాలతో రూపుదిద్దుకున్న ఈ ఏడు సినిమాలలో దేనికి ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి.

Exit mobile version