Site icon NTV Telugu

Tollywood: ఈ వీకెండ్ మూవీస్ ఇవే!

Weekend

Weekend

Telugu Cinema: లాస్ట్ వీకెండ్ కేవలం మూడంటే మూడే సినిమాలు వచ్చాయి. అందులో రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు కాగా, ఒకటి ఆంగ్ల అనువాద చిత్రం. చిత్రం ఏమంటే రవితేజ నటించిన ‘రావణాసుర’, కిరణ్ అబ్బవరం ‘మీటర్’ రెండు సినిమాలను ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఈ వారం రెండు అనువాద చిత్రాలతో కలిపి మొత్తం ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో మొదటిది ‘ఓ కల’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ 13వ తేదీ స్ట్రీమింగ్ కాబోతోంది. గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు దీపక్ కొలిపాక దర్శకుడు. లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి. ఆదిత్య రెడ్డి దీన్ని నిర్మించారు. అన్ని కమర్షియల్ హంగులను రంగరించి ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా దీనిని తెరకెక్కించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అలానే ఉదయ్ బండారి, సురేశ్ కంభంపాటి దర్శకత్వం వహించిన ‘అసలు’ సినిమా ఈటీవీ విన్ లో 13వ తేదీన స్ట్రీమింగ్ కాబోతోంది. దీన్ని నట దర్శకుడు రవిబాబు నిర్మించడంతో పాటు ఇందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించాడు. పూర్ణ, సత్యకృష్ణన్, సూర్య తదితరులు ఈ మర్డర్ మిస్టరీలో కీలక పాత్రలు పోషించారు.
T
ఇదిలా ఉంటే… ఈ శుక్రవారం తెలుగు నుండి ఓ పాన్ ఇండియా మూవీ వస్తోంది. అదే సమంత నటించిన ‘శాకుంతలం’. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆయన కుమార్తె నీలిమా గుణ నిర్మాత. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ‘దిల్’ రాజు దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమా త్రీడీలో కూడా విడుదల అవుతోంది. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో బుల్లి భరతుడి పాత్రను అల్లు అర్జున్ కూతురు అర్హా పోషించింది. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాపై దర్శక నిర్మాతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదే రోజున హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన ‘బి అండ్ డబ్ల్యూ’ (బ్లాక్ అండ్ వైట్) మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఎల్.ఎన్.వి. సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో ఈ థ్రిల్లర్ మూవీని పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మించారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని పోషించారు. కొరియోగ్రాఫర్, డైరక్టర్ కమ్ యాక్టర్ రాఘవేంద్ర లారెన్స్ నటించిన తమిళ చిత్రం ‘రుద్రుడు’ కూడా ఈ నెల 14వ తేదీనే విడుదల అవుతోంది. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెలుగులో ‘ఠాగూర్’ మధు విడుదల చేయబోతున్నారు. దీన్ని కతిరేశన్ డైరెక్ట్ చేశాడు.
ఏప్రిల్ 15 శనివారం కూడా ఓ సినిమా తెలుగువారి ముందుకు రాబోతోంది. అదే ‘విడుదల’. తమిళంలో ‘విడుదలై’ పేరుతో మార్చి 31న విడుదలైన ఈ సినిమాలో కమెడియన్ సూరి హీరోగా నటించాడు. విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించాడు. భవానీ శ్రీ హీరోయిన్. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రి మారన్ రూపొందించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తరఫున అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. గత వారం విడుదల కావాల్సి ఉండి ఈ నెల 14వ తేదీకి వాయిదా పడిన ‘ఆగస్ట్ 16, 1947’ సినిమా ఈ వారం కూడా రావడం లేదు.

Exit mobile version