NTV Telugu Site icon

Tollywood: పరీక్షల కారణంగా కొన్ని వెనక్కి… అదే అదనుగా కొన్ని ముందుకు!

Tollywood

Tollywood

Telugu Cinema: ఇవాళ ఏ సినిమా ఏ వారం విడుదల అవుతుందో ముందే గెస్ చేయడం కష్టం. పైగా ఇది ఎగ్జామ్స్ సీజన్ కావడంతో చాలా సినిమాలను దర్శక నిర్మాతలు పోస్ట్ పోన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ దగ్గర పడటంతో థియేటర్లకు జనం రావడం బాగా తగ్గిపోతుందనే భావనతో వారీ నిర్ణయం తీసుకుంటున్నారు. ‘నేను స్టూడెంట్ సార్’ మూవీ నిర్మాతలైతే అదే కారణంగా వెనక్కి వెళ్ళిపోతున్నామని స్పష్టంచేశారు. అయితే… ఇది సినిమాలకు అచ్చి వచ్చే సీజన్ కాకపోయినా, ఆ తర్వాత మళ్ళీ తమకు థియేటర్లు దొరకుతాయో లేదో అనే సందేహంతో చాలా మంది చిన్న చిత్రాల నిర్మాతలు తమ సినిమాలను జనం ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమౌతున్నారు. గత వారం ఏడు సినిమాలు విడుదల కాగా… మార్చి సెకండ్ వీకెండ్ లో దాదాపు 9 చిత్రాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ తొమ్మిది చిత్రాల నిర్మాతలు ఖచ్చితంగా తాము వీకెండ్ లో వస్తామనే చెబుతున్నారు.

గత యేడాది ఆది సాయికుమార్ నటించిన చిత్రాలు ఐదు విడుదల అయ్యాయి. ఈ యేడాది ‘పులి మేక’ వెబ్ సీరిస్ తో ఈ యువ కథానాయకుడు జనం ముందుకు వచ్చాడు. జీ5తో కలిసి కోన వెంకట్ దీనిని నిర్మించాడు. ఫోరెన్సిక్ నిపుణుడిగా ఆది పోషించిన పాత్ర మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఆ సక్సెస్ నేపథ్యంలోనే అతని తాజా చిత్రం ‘సి.ఎస్.ఐ. సనాతన్’ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. అలానే అదే రోజున ‘నేడే విడుదల’, ‘టాక్సీ’, మిస్టర్ కళ్యాణ్‌, వాడు ఎవడు?, ఇ.ఎం.ఐ. ఈ అమ్మాయి’ చిత్రాలు రాబోతున్నాయి. వీటితో పాటు 10న అనువాద చిత్రం ‘పులి’, ’65 మిలియన్ ఇయర్స్ ఎగో జంతు ప్రపంచం’మూవీలూ విడుదల అవుతున్నట్టు ప్రకటన వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ ఎనిమిది చిత్రాలతో పాటు సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు రూపొందించిన ‘దోచేవారెవరురా’ మార్చి 11న విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఒకటి, రెండు తెలుగు సినిమాల్లో నటించిన మాళవిక సతీషన్ హీరోయిన్ గా చేస్తోంది. అజయ్ గోష్, బిత్తిరి సత్తి, మాస్టర్ చక్రి, జెమిని సురేష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ వారం జనం ముందుకు వచ్చే తొమ్మిది సినిమాలలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చూద్దాం.

Show comments