Yatra 2:ఈ ఏడాది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోన్న సినిమాల్లో యాత్ర 2 ఒకటి. రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2009 నుంచి 2019 వరకు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన మూవీ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా యాత్ర 2ను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వై.ఎస్.జగన్ చేసిన ప్రామిస్‌ను ఎలా నిలబెట్టుకున్నారనేది ఈ సినిమా ప్రధానాంశం. యాత్ర 2 లోని ప్రధాన పాత్రలు గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి … వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీ పాత్రలో సుసాన్నె బెన్నెట్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వై.ఎస్.షర్మిల పాత్రల్లో ఎవరు నటించారనే దానిపై పలు రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు యాత్ర 2 లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వై.ఎస్.షర్మిల పాత్రలు ఉండవు. తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి జగన్ చేస్తున్న పోరాటం, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధంలోని భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తూ వై.ఎస్.జగన్ చేసిన పాదయాత్ర గురించి మాత్రమే యాత్ర 2 చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ రూపొందించారు. పాత్రల మీద దృష్టి పెడితే తాను చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్‌ను చెప్పలేమని భావించిన డైరెక్టర్ ముందు నుంచి తన ప్రణాళిక ప్రకారం యాత్ర 2ను తెరకెక్కించినట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.