NTV Telugu Site icon

The Trail: లేడీ ఓరియంటెడ్ కాన్ స్పిరెసీ మూవీ టీజర్ విడుదల!

T

T

Ram Ganni: స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ది ట్రయల్’. రామ్ గన్నీ దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడు దీన్ని నిర్మించారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను ‘పుష్ప’ రచయిత శ్రీకాంత్ విస్సా; నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె; ‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గన్నీ మాట్లాడుతూ, “మా నిర్మాతగారికి కథ నెరేట్ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఈ కథ కంటే ముందు నిన్ను నమ్ముతున్నాను అని. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన రిస్క్ తీసుకుని సినిమా స్టార్ట్ చేశారు. ఓ దర్శకుడుగా నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా తీశాను. మా మరో నిర్మాత నాయుడుగారు కూడా ఈ సినిమాను తన భుజాలపై మోశారు. ఆయన వల్లే ఇంత మంచి అవుట్ పుట్ వచ్చింది. మా డివోపి సాయికుమార్ గారికి నాన్ సింక్ లా అనిపించినా నేను అనుకున్న షాట్ తీయడానికి మ్యాజిక్స్ చేశారు. ఎడిటర్ శ్రీకాంత్ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. శర్వా సంగీతంతో మూవీకి ప్రాణం పోశాడు. ఈ కథ గురించి చెప్పాలంటే.. లేడీ ఓరియంటెడ్ స్టోరీ. ఓ మహిళ, ఆమె భర్త చుట్టూ జరిగే కాన్ స్పిరసీకి సంబంధించింది. హీరోయిన్ పాత్ర కోసం చాలామందిని చూసిన తర్వాత స్పందనను ఓకే చేశాం. చాలా బాగా ఆ పాత్రను ఆమె పోషించింది” అన్నారు.

హీరోయిన్ స్పందన మాట్లాడుతూ, “ఇది థ్రిల్లర్ సినిమా అయినా ఫన్ గానూ ఉంటుంది. ఇలాంటి పాత్ర ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్యూ. మా ప్రొడ్యూసర్స్ చొరవ చూపకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ఎక్కువ షూటింగ్ అంతా వైజాగ్ లోనే బ్యూటీఫుల్ లొకేషన్స్ లో చేశాం” అని అన్నారు. “దర్శకుడు సబ్ ఇన్స్ పెక్టర్. ఆ పోస్ట్ ను వదులుకుని ప్యాషన్ తో ఇటు వైపు వచ్చారు. ఎంతో గట్స్ ఉంటే తప్పితే ఇలా చేయరు. సినిమా పట్ల మా దర్శకుడికి ఉన్న ఉన్న ప్రేమే మాకు విజయాన్ని తెచ్చిపెడుతుంది” అని హీరో వంశీ కోటు చెప్పారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు పడిన కష్టం తెర మీద కనిపిస్తుందని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మరో హీరో యుగ్ రామ్ తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ఈ సినిమాను పూర్తి చేశామని, మంచి విజయాన్ని ప్రేక్షకులు అందిస్తారనే నమ్మకం ఉందని నిర్మాత సతీశ్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వచ్చిన శ్రీకాంత్ విస్సా, రఘు కుంచె, రక్షిత్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియచేశారు.