యంగ్ హీరో నాగశౌర్య, బ్యూటీఫుల్ హీరోయిన్ షెర్లీ సేఠియా జంటగా నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ నెల 23న ఈ మూవీ జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాగశౌర్య ఇవాళ్టి నుండి పాదయాత్ర మొదలు పెట్టాడు. ఈవారంలో పలు నగరాలు, పట్టణాలను కవర్ చేయబోతున్నాడు. తిరుపతిలో ప్రస్తుతం ఈ పాదయాత్ర జరుగుతోంది. విశేషం ఏమంటే… అదే సమయంలో ఈ మూవీ టైటిల్ సాంగ్ నూ రిలీజ్ చేశారు. ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ ధీమ్ ను తెలియచేసేలా ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, రామ్ మిర్యాల పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ దీనికి స్వర రచన చేశాడు.
ఆద్యంతం సరదాగా సాగిపోయిన ఈ పాట వింటుంటే కథానాయకుడు నాగశౌర్య మీద జాలి కలగక మానదు. ప్రేమలో పడి, ఆ పైన ఊహించని అగచాట్లకు గురైన ప్రేమికుడిగా నాగశౌర్య నటించాడు. సినిమాలోని ప్రధాన తారాగణం అంతా ఈ మాంటేజ్ సాంగ్ లో మనకు కనిపిస్తారు. కొన్ని మేకింగ్ సీన్స్ ను ఆసక్తికరంగా ఇందులో పెట్టారు. అనీశ్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నాగశౌర్య సరికొత్తగా కనిపించబోతున్నాడని ఈ టైటిల్ సాంగ్ చూస్తే అర్థమౌతోంది.
