Site icon NTV Telugu

Nethaji: పవన్ కళ్యాణ్ తలుచుకుంటే…

ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దిన పత్రికల మాజీ సంపాదకులు, ప్రముఖ రచయిత, జాతీయవాది ఎం.వి.ఆర్. శాస్త్రి తాజాగా సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను ‘నేతాజీ’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో విడుదల చేశారు. అయితే ఆ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సైతం హాజరు కావాల్సి ఉంది. కానీ అదే సమయంలో ముందుగా అంగీకరించిన కార్యక్రమం కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొనలేదు. కానీ ఆ పుస్తకం విడుదలైన వెంటనే ఆ విషయాన్ని అప్పట్లోనే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ఎంవీఆర్ శాస్త్రిని అభినందించారు. ఇప్పుడు మరోసారి ఆ పుస్తకం పట్ల, రచయిత పట్ల తనకున్న గౌరవాన్ని పవన్ కళ్యాణ్‌ చాటిచెప్పబోతున్నారు.

ఎంవీఆర్ శాస్త్రి రాసిన ‘నేతాజీ’ గ్రంధ సమీక్షా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్సీ ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించబోతోంది. ‘నేతాజీ’ పుస్తకాన్ని ఈ వేదికపై ప్రముఖ సినీ రచయిత సత్యానంద్, ఆంధ్రప్రభ దిన పత్రిక సంపాదకులు వైయస్ఆర్ శర్మ, భగవద్గీత ఫౌండేషన్, ఛైర్మన్ ఎల్. గంగాధర శాస్త్రి సమీక్షించబోతున్నారు. ఈ కార్యక్రమంలో రచయిత ఎంవీఆర్ శాస్త్రితో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఓ గ్రంధ సమీక్షా కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరపడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఈ రకంగా పుస్తకం పట్ల తనకున్న మక్కువను పవన్ కళ్యాణ్‌ మరోసారి నిరూపించుకున్నారు.

Exit mobile version