మెగాస్టార్ చిరంజీవిని అందరూ ద రియల్ ఫ్యామిలీ మేన్ అంటూ ఉంటారు. తాను ఎంత బిజీగాఉన్నా, తన కుటుంబాన్ని మాత్రం ఆయన ఎన్నటికీ మరచిపోరని సన్నిహితులు చెబుతూంటారు. అలాగే తన బంధుమిత్రులను, అభిమానులను సైతం ఆయన కుటుంబంగానే భావిస్తుంటారు. అలాంటి చిరంజీవి సొంత మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను గురించి ఆలోచించకుండా ఉంటారా చెప్పండి. సాయిధరమ్ రోడ్డు ప్రమాదం కారణంగా ఆసుపత్రి పాలయినప్పటి నుంచీ చిరంజీవి, అతని యోగక్షేమాలు విచారంచడమే కాదు, ఎప్పటికప్పుడు వైద్యుల ద్వారా తన మేనల్లుడి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసేవారు. సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే అతని బర్త్ డే జరిగింది. అలాగే ఆయన హీరోగా నటించిన ‘రిపబ్లిక్‘ చిత్రం విడుదలయింది. అభిమానులు ఆందోళన చెందారు. అందరినీ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సాయిధరమ్ పరిస్థితి వివరిస్తూ ట్వీట్స్ ద్వారా ఊరడించారు.
సాయిధరమ్ పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందిన తరువాత తొలిసారి తన ముగ్గురు మేనమామలను కలుసుకున్నారు. “నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి, ప్రార్థనలకి ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం” అంటూ సాయిధరమ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు చిరంజీవి సైతం “సాయిధరమ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సాయిధరమ్ తన ముగ్గురు మేనమామలు – చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ , తమ్ముడు వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకిరా నందన్ తో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ అలరిస్తోంది. నిజానికి చిరంజీవి అంటే ఆయన కుటుంబసభ్యులలో ఎంతటి గౌరవం ఉందో ఈ ఫోటో తెలియజేస్తోంది. అలాగే తన కుటుంబ సభ్యుల పట్ల ఆయన ఏలాంటి ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తారో మరోసారి రుజువయింది. ఒకప్పుడు చిరంజీవి, ఆయన మామ అల్లు రామలింగయ్య, బావ అల్లు అరవింద్ మాత్రమే జనానికి తెలుసు. చిరంజీవి, అరవింద్ సంయుక్తంగా మెగా కాంపౌండ్ను నిర్మించారు. ఆ తరువాత అందులో నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలు ఒక్కరొక్కరుగా చేరిపోయారు. ఎవరికివారు తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నవారే. ప్రస్తుతం చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అయినప్పటికీ సాయిధరమ్ కోలుకున్నాడని తెలియగానే ముగ్గురు మేనమామలు ఆనందించడమే కాదు, తమ పనులు కాసేపు పక్కన పెట్టి, అందరూ ఒకటిగా కలవడం అన్నది చిరంజీవి అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.
చిరంజీవికి, ఆయన సోదరులకు మధ్య విభేదాలు నెలకొన్నాయని కొందరు అంటూ ఉంటారు. కానీ, చిరంజీవి అంటే వారి కుటుంబంలో ఎంత గౌరవం ఉందో అన్న దానికి ప్రస్తుతం దర్శనమిస్తున్న ఈ ఫోటోయే నిదర్శనం. నిజానికి, ఎవరికి ఎవరితో విభేదాలు ఉన్నా, అవన్నీ టీ కప్పులో తుఫాను లాంటివే. ఇక చిరంజీవితో విభేదించే సాహసం కానీ, ధైర్యం కానీ ఇంకా ఆ కుటుంబంలో ఎవరికీ లేదు. అలాంటి పరిస్థితిని చిరంజీవి ఎన్నడూ రానీయరు. ఎందుకంటే ఆయన తన కుటుంబ సభ్యుల్లో ప్రతీ ఒక్కరినీ ఓ స్థాయిలోనిలబెట్టాలనే తపిస్తూ ఉంటారు. తమ ఉన్నతి కోరుకొనే వారిపై ఎవరైనా విభేదాలు పెట్టుకుంటారా? పైగా ఈ రో్జున మెగా కాంపౌండ్ అన్న పేరు విశేషంగా వినిపించడానికి కారకులైన చిరంజీవి, అరవింద్ ఆ పరిస్థితి తలెత్తకుండానే చూసుకుంటారు. పవన్ ఎంత బిజీగా ఉన్నా, అన్నయ్య సన్నిధిలో చేరిపోయారంటే ఆయనకు తన అన్నపై ఉన్న అభిమానం మరోమారు అందరికీ తెలిసింది. అలాగే, అల్లు అర్జున్ కు చిరంజీవి కుటుంబ సభ్యులకు దూరం పెరిగింది అనే ప్రచారానికి సైతం ఈ ఫోటో ఫుల్ స్టాప్ పెట్టేసింది. మెగా ఫ్యామిలీ ఏ నాటికీ చెక్కు చెదరదు. ఎందుకంటే దానిని నిర్మించినది ద రియల్ ఫ్యామిలీ మేన్ చిరంజీవి!
