ఆస్కార్ సందడి మళ్ళీ మొదలైంది. వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే 95వ ఆస్కార్ ఉత్సవం ఈ యేడాది మార్చి 12 ఆదివారం సాగింది. అందులోనే మన తెలుగు సినిమా ‘ట్రిపుల్ ఆర్’ బెస్ట్ సాంగ్ కు గాను, మరో ఇండియన్ మూవీ ‘ఎలిఫెంట్ విష్పరర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో ఆస్కార్ అందుకొని మురిపించాయి. దాంతో ఇప్పటికీ ఇండియన్స్ లో ఆస్కార్ పేరు వినగానే ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సాగి పట్టుమని నెలన్నర కూడా కాలేదు. అప్పుడే 96వ ఆస్కార్ అవార్డుల గురించి తేదీలు ప్రకటించారు. దానిని చూసే మళ్ళీ ఆస్కార్ సందడి మొదలైందని సినీజనం అంటున్నారు. ఈ యేడాది విడుదలయ్యే సినిమాలకు వచ్చే సంవత్సరం ఆస్కార్ బరిలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసియా దేశాల చిత్రాలకు అమెరికా దేశంలో ప్రదర్శనలోనూ, ప్రోత్సాహంలోనూ వీలుకల్పిస్తూనే ఇకపై ఆస్కార్ అవార్డుల ప్రదానం సాగనుందని తెలుస్తోంది. అందువల్లే ఇంత తొందరగా ఆస్కార్ నామినేషన్లు పొందేందుకు వీలుగా తేదీలు ప్రకటించారనీ వినిపిస్తోంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2024 మార్చి 10న ఆదివారం సాగనుందని అకాడమీ పేర్కొంది. మన భారతీయ కాలమానంప్రకారం 2024 మార్చి 11 ఉదయం 5.30 గంటలకు 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
ఈ యేడాది నవంబర్ 18వ తేదీలోగా జనరల్ కేటగిరీల్లో నామినేషన్స్ పొందాలనుకొనేవారు తమ చిత్రాలను ఎంట్రీలుగా అకాడమీకి పంపాలి. డిసెంబర్ 18న ప్రిలిమినరీ ఓటింగ్ ఉంటుంది. డిసెంబర్ 21న ఏయే కేటగిరీల్లో ఏయే సినిమాలు నామినేషన్స్ కోసం పోటీపడుతున్నాయో ఫలితాలు వెల్లడిస్తారు. అయితే జనరల్ కేటగిరీ కాని చిత్రాలకు డిసెంబర్ 31లోగా ఎంట్రీలకు అవకాశం ఉంటుంది. ఇక రెండవ ఘట్టం జనవరి 11 నుండి 16 మధ్య నామినేషన్స్ వోటింగ్ సాగుతుంది. జనవరి 23వ తేదీన ఏ యే సినిమాలు, ఏయే విభాగాల్లో నామినేషన్లు పొందాయో వెల్లడిస్తారు. మూడవ ఘట్టం – ఫైనల్ ఓటింగ్ ఫిబ్రవరి 22న జరగనుంది. మార్చి 10న అవార్డుల ప్రదానోత్సవం సాగనుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ తేదీల్లోనే అకాడమీ ప్రకటించిన ప్రణాళిక ప్రకారం ఎంపిక నిర్వహిస్తుంది. ఏవైనా అవాంతరాలు జరిగితే తప్ప ఈ తేదీల్లోనే అన్నీ సాగుతాయి.
96వ ఆస్కార్ అవార్డుల బరిలో ప్రధానమైన తేదీలు:
– జనరల్ కేటగిరీలో ఎంట్రీకి చివరి తేదీ : 2023 నవంబర్ 15
– గవర్నర్ అవార్డ్స్ (లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్స్) : 2023 నవంబర్ 18
– ప్రిలిమనరీ వోటింగ్ ఆరంభం : 2023 డిసెంబర్ 18 ఉదయం 9 గంటలకు.
– ప్రిలిమనరీ వోటింగ్ ముగింపు : 2023 డిసెంబర్ 21 సాయంత్రం 5 గంటలకు.
– ఆస్కార్ నామినేషన్ షార్ట్ లిస్ట్స్ ప్రకటన: 2023 డిసెంబర్ 21
– (నాన్-జనరల్ కేటగిరీ) ఎలిజిబులిటీ పీరియడ్ ముగింపు: 2023 డిసెంబర్ 31
– నామినేషన్ వోటింగ్ ఆరంభం : 2024 జనవరి 11, గురువారం ఉ. 9 గంటలకు
– నామినేషన్ వోటింగ్ ముగింపు : 2024 జనవరి 16, మంగళవారం సా. 5 గంటలకు
– ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన : 2024 జనవరి 23, మంగళవారం
– నామినీస్ లంచెన్ : 2024 ఫిబ్రవరి 12 సోమవారం
– ఫైనల్ వోటింగ్ ఆరంభం : 2024 ఫిబ్రవరి 22, గురువారం ఉ.9 గంటలకు
– ఫైనల్ వోటింగ్ ముగింపు : 2024 ఫిబ్రవరి 27, మంగళవారం సా.5 గంటలకు
– 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం: 2024 మార్చి 10, ఆదివారం (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11 ఉ.5.30 గంటలకు)
