గత 50 రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సినిమా ‘పఠాన్’. 130 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ కే కాదు మొత్తం బాలీవుడ్ కే కంబ్యాక్ సినిమాగా నిలిచింది. వెయ్యి కోట్లకి పైగా రాబట్టిన పఠాన్ సినిమా బాలీవుడ్ లో బాహుబలి 2 రికార్డులని కూడా బ్రేక్ చేసి టాప్ పొజిషన్ లో కూర్చుంది. అయిదేళ్ల పాటు సినిమాలు చెయ్యకున్నా తన బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదు అని నిరూపించిన షారుఖ్ ఖాన్ జూన్ నెలలో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి ‘జవాన్’ సినిమాని రెడీ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, నయనతార హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ లో షూటింగ్ జరుపుకుంటున్న జవాన్ సినిమాని జూన్ 2న విడుదల చేస్తామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జవాన్ సినిమా వాయిదా పడినట్లు ఉంది.
జవాన్ మూవీ షూటింగ్ పార్ట్ వచ్చే నెలలో పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంది. అందువల్ల సినిమాను నాలుగు నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని మేకర్స నిర్ణయించుకున్నారని బాలీవుడ్ మీడియా సమాచారం. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం కేటాయించడం కాదు దళపతి విజయ్ కోసమే జవాన్ ఆలస్యం అవుతుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అట్లీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన విజయ్, జవాన్ సినిమాలో ఒక క్యామియో ప్లే చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ‘లియో’ సినిమా షూటింగ్ అయిపోగానే జవాన్ మూవీ క్యామియో షూటింగ్ చెయ్యడానికి విజయ్ వస్తాడని , విజయ్ కోసమే జవాన్ సినిమా వాయిదా వేస్తున్నారు అని తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. విజయ్ క్యామియోపై కానీ జవాన్ వాయిదా విషయంలో కానీ జవాన్ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. మరి జవాన్ చెప్పినట్లుగానే జూన్ 2న థియేటర్స్ లోకి వస్తాడా లేక కాస్త వెనక్కి వెళ్తాడా అనేది చూడాలి.
