కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవలే దీని ప్రమోషన్ యాక్టివిటీస్ ను మొదలు పెట్టారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే… సినిమాల్లోకి రాకముందు నుండే అజిత్ కు బైక్స్ అంటే ప్రాణం. అంతేకాదు అతను ప్రొఫెషనల్ రేసర్ కూడా! కొంతకాలంగా అజిత్ బైక్ పై వరల్డ్ టూర్ చేయాలని కలలు కంటున్నాడు. దాంతో వరల్డ్ ఫేమస్ మోటర్ బైకింగ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మరల్ ను అజిత్ ఇటీవల కలిశాడు. ఈ విషయాన్ని అజిత్ మేనేజన్ సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం వెల్లడించాడు. మరల్ సోలోగా మోటర్ సైకిల్ పై ఏడు ఖండాలు, 64 దేశాలను కవర్ చేసింది. ఆమె అనుభవాలను తెలుసుకోవడానికి ఆమెను అజిత్ ఢిల్లీ వెళ్ళి కలిశాడని, తాను త్వరలో చేయబోయే వరల్డ్ టూర్ కోసం సలహాలు తీసుకున్నాడని మేనేజర్ తెలిపాడు.
అయితే తాజాగా అజిత్ వరల్డ్ టూర్ కు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో అతను మరల్ ను మరోసారి కలిసినట్టు తెలుస్తోంది. ఈసారి ఈ విషయాన్ని మరల్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అజిత్ ఎంత పేరున్న నటుడో అతన్ని కలిసే సమయానికి తనకు తెలియదని, తాము కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విధానం చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ఓ నటుడిగా కాకుండా అజిత్ వ్యక్తిగా తనకెంతో నచ్చాడని తెలిపింది. పేరున్న ఫిల్మ్ స్టార్ అయి ఉండి కూడా అజిత్ ఎంతో హుందాగా, గౌరవంగా, అతి సాధారణ వ్యక్తిలా తనతో మాట్లాడారని, ఆయనలోని ఆ స్వభావం తనకెంతో నచ్చిందని మరల్ చెప్పింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే అజిత్ ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెబుతూ, ఆయన అనుమతితోనే అతనితో తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు మరల్ పేర్కొంది. ఇప్పుడీ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
