NTV Telugu Site icon

Telugu Movies: అంతర్జాతీయ వేదికపై మన తెలుగు సినిమాలు!

Telugu Films At Internation

Telugu Films At Internation

Telugu Movies At International Events: ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ద్వారా మన హీరోలు జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేషన్ సంపాదిస్తారని అభిమానులు ఆశించారు. ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ‘క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్’లో ‘బెస్ట్ యాక్టర్ ఇన్ ఏన్ యాక్షన్ మూవీ’ విభాగంలో ఇద్దరు హీరోలూ నామినేషన్స్ సంపాదించడం విశేషంగా మారింది. వీరితో పాటు ప్రఖ్యాత హాలీవుడ్ నటులు నికోలాస్ కేజ్, టామ్ క్రూయిజ్, బ్రాడ్ పిట్ కూడా అదే విభాగంలో బరిలో ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుండే ఈ సూపర్ అవార్డ్స్ ప్రదానం చేస్తూ వస్తున్నారు. అందునా ఈ అవార్డ్స్ లో యాక్షన్ మూవీస్ , సూపర్ హీరోస్ మూవీస్, హారర్ మూవీస్, సైంటిఫిక్ ఫిక్షన్ మూవీస్ అంటూ పలు కేటగిరీలు, వాటిలో మళ్ళీ నటీనటులకు, సినిమాలకు అవార్డులూ ఉన్నాయి. ఏది ఏమైనా మన హీరోలు ఇద్దరికీ అక్కడ నామినేషన్స్ లభించడం ఇండియన్ సినీ ఫ్యాన్స్ కు ఆనందం పంచుతోంది. మార్చి 16న ఈ అవార్డులను ప్రకటిస్తారు. అంతకు ముందే మార్చి 7వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సాగుతుంది.

రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ మూవీలోని “నాటు నాటు…” పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో నామినేషన్ సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు నామినేషన్ సంపాదించిన తొలి తెలుగు చిత్రంగానే కాదు, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో నామినేషన్ సంపాదించిన తొలి ఏసియన్ మూవీగానూ ‘ట్రిపుల్ ఆర్’ చరిత్ర సృష్టించింది. ఈ విషయాలను అందరూ అంగీకరించవలసిందే. అలాగే తెలుగు సినిమాకు రాజమౌళి తీసుకు వస్తోన్న ఘనతనూ అభినందించవలసిందే! అయితే ఇక్కడే కొందరు తెలిసో తెలియకో అసలు విదేశీ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన చిత్రాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని చాటింపు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన గత చరిత్రలోని ఘనతనూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

బి.యన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ’ 1946లో జరిగిన వియత్నామ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం. విదేశాలలోనూ విశేషాదరణను చూరగొన్న చిత్రంగా బి.యన్.రెడ్డి ‘మల్లీశ్వరి’ (1951) చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే చైనా దేశంలో విశేషాదరణ పొందింది. అలాగే పెకింగ్ ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది. శాన్ సెబాస్టియన్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ‘నమ్మినబంటు’ (1960) సినిమా స్క్రీనింగ్ జరిగింది. ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా నిలచిన ప్రాంతీయ సినిమాలను సైతం విదేశాలలో ప్రదర్శించే ఏర్పాట్లు జరిగేవి. కొందరు నిర్మాతలు, దర్శకులు తమ సొంతగా ప్రయత్నాలు చేసుకొని, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శనలు సాగేలా చూసుకున్నారు. అలా ప్రదర్శితమైన తెలుగు చిత్రాలలో “నర్తనశాల, సీతాకళ్యాణం, శంకరాభరణం, మేఘసందేశం, స్వాతిముత్యం, స్వయంకృషి, పడమటి సంధ్యారాగం” వంటివి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో “ఈగ, బాహుబలి, డ్రీమ్స్, నా బంగారు తల్లి” వంటి సినిమాలూ ఆ తీరున సాగాయి. ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవాలలో పోటీ విభాగాల్లో పాల్గొని అవార్డులు సంపాదించినవి అంతగా లేవనే చెప్పాలి.

ఆఫ్రో- ఏసియన్ ఫిలిమ్ ఫెస్లివల్ కథ!
ఆ రోజుల్లో కొందరు ఆసియా దేశీయులు ఆఫ్రికాలో ప్రవాసం వెళ్ళారు. అక్కడి చలనచిత్ర ప్రముఖులతో కలసి మనవాళ్ళు ‘ఆఫ్రో ఏసియన్ ఫిలిమ్ ఫెస్టివల్’ నిర్వహించేవారు. 1958లో తొలుత తాష్కెంట్ లో మొదలైన ఈ చిత్రోత్సవాలలో ముందుగా తమిళులు తమ చిత్రాలను ప్రదర్శించారు. అప్పుడు ఈ చిత్రోత్సవంలో బెస్ట్ ఫిలిమ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిమ్ విభాగాలు ఉండేవి. ఆ యేడాది వచ్చిన చిత్రాలలో ఈ విభాగాలకు అవార్డులు ప్రదానం చేసేవారు. వారి పంథాలోనే తరువాత మన తెలుగువారూ సాగారు. ఇది విస్త్రృత స్థాయి పోటీ చిత్రోత్సవం కాదన్నది గమనార్హం! తమ చిత్రాలను అక్కడ ప్రదర్శించేవారు వాటిలో నటించిన నటీనటులను, సాంకేతిక నిపుణులనూ తీసుకువెళ్ళేవారు. వారిలో ఉత్తములుగా భావించిన వారికి అవార్డులు ప్రదానం చేసేవారు. రెండవ ‘ఆఫ్రో ఏసియన్ ఫిలిమ్ ఫెస్టివల్’ 1960లో ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగింది. ఈ చిత్రోత్సవంలో తమిళ చిత్రం ‘వీరపాండ్య కట్టబొమ్మన్’ ప్రదర్శితమయింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన శివాజీగణేశన్ కు ఉత్తమ నటునిగా అవార్డు లభించింది. ఆయనతో పాటు ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా, ఆ చిత్ర సంగీత దర్శకులు జి.రామనాథన్ కు ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డులు లభించాయి. ఓ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వేదికగా అవార్డులు సంపాదించిన తొలి భారతీయచిత్రంగా ‘వీరపాండ్య కట్టబొమ్మన్’ నిలచింది. అలాగే బెస్ట్ యాక్టర్ గా ఇంటర్నేషసల్ అవార్డు అందుకున్న తొలి ఇండియన్ యాక్టర్ గా శివాజీగణేశన్ చరిత్రలో నిలచిపోయారు.

తరువాత 1964లో ఇండోనేషియా రాజధాని జకార్తాలో మూడవ ‘ఆఫ్రో-ఏసియన్ ఫిలిమ్ ఫెస్టివల్’ నిర్వహించారు. అందులో మన తెలుగు చిత్రం ‘నర్తనశాల’ పాలు పంచుకుంది. అప్పుడు ఆ సినిమాతో పాటు నిర్మాతలు లక్ష్మీరాజ్యం-శ్రీధరరావు, కీచక పాత్రధారి యస్వీ రంగారావు, కళాదర్శకుడు టి.వి.యస్. శర్మ వెళ్ళారు. అప్పుడే ఉత్తమ నటునిగా యస్వీ రంగారావును గౌరవించారు. శర్మను ఉత్తమ కళాదర్శకునిగా ఎంపిక చేశారు. ఆ తరువాత ఎందుకనో ఈ ‘ఆఫ్రో-ఏసియన్ ఫిలిమ్ ఫెస్టివల్’ ముందుకు సాగిన దాఖలాలు లేవు. నవతరం ప్రేక్షకులకు గతంలోనూ మనకు ఘనచరిత ఉందని తెలియజేయడానికే ఈ ప్రయత్నం. ఆస్కార్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు కాకపోయినా ‘క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డు’ల్లో నామినేషన్ సంపాదించిన మన జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ ను అభినందించి తీరాలి. వారితో పాటు, బెస్ట్ యాక్షన్ మూవీ కేటగిరీలో నామినేషన్ సంపాదించిన ‘ట్రిపుల్ ఆర్’ సినిమా టీమ్ నూ అభినందించాల్సిందే! ఎటూ ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాటకు ఆస్కార్ అవార్డు పక్కా అని అందరూ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. అదే తీరున ‘క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డుల్లో’నూ మన ‘ట్రిపుల్ ఆర్’ సత్తా చాటాలని ఆశిద్దాం!