ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడిల్ నిదానంగా ఊపందుకుంటోంది. తాజాగా ఈ వీకెండ్ లో జరిగిన షోలో టాప్ 12 కంటెస్టెంట్స్ ను జడ్జెస్ ఎంపిక చేశారు. గతంలోనే గోల్డెన్ మైక్ ను పొందిన వారు ఈసారి పోటీకి డైరెక్ట్ గా రాగా, గోల్డెన్ టిక్కెట్ పొందిన వారు టాప్ 12 లిస్ట్ లో చోటు కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఇందులో న్యాయనిర్ణేతలు శనివారం ధరంశెట్టి శ్రీనివాస్, వాగ్దేవి పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయి వారికి ఈ సెకండ్ రౌండ్ లో గోల్డెన్ మైక్ ఇచ్చారు. అలానే శనివారం జరిగిన షోలో ‘అతడు’ సినిమాలోని ‘పిల్లగాలి అల్లరి…’ పాట పడిన ప్రణతి గోల్డెన్ మైక్ ను సొంతం చేసుకుంది. మణిశర్మ స్వరపరిచిన ‘అతడు’ సినిమాతో పాటు, ప్రత్యేకంగా ఈ పాటతో తనకు ఎంతో అనుబంధం ఉందంటూ ఆనాటి రోజుల్ని తమన్ తలుచుకున్నాడు. అలానే అదే ఊపులో లక్ష్మీ శ్రావణి సైతం గోల్డెన్ మైక్ ను అందుకుంది. ఇతర జడ్జెస్ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా లక్ష్మీ శ్రావణి పాట తనకెంతో నచ్చిందని నిత్యా మీనన్ ఆమెకు గోల్డెన్ మైక్ ఇవ్వడం విశేషం. దాంతో మొత్తం 12 మందిలో నలుగురు బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో గోల్డెన్ మైక్ తొలి రౌండ్ లోనే అందుకున్నారు.
అదృష్టవంతుల జాబితాలో ఆ ఎనిమిదిమంది!
థియేటర్ రౌండ్ లో మొత్తం పన్నెండు మందిని తెలుగు ఇండియన్ ఐడిల్ ఫైనల్ కంటెస్టెంట్స్ గా ఎంపిక చేయాలని న్యాయనిర్ణేతలు భావించారు. టఫ్ కాంపిటీషన్ మధ్య… పెర్ఫార్మెన్స్ లోని అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని మాన్య, జస్కరణ్, మారుతి, రేణు కుమార్, వైష్ణవి, అదితి, లాలస, జయంత్ లను తమన్, నిత్యామీనన్, కార్తీక్ ఎంపిక చేశారు. వీరితో పాటు అప్పటికే గోల్డెన్ మైక్ పొందిన శ్రీనివాస్, వాగ్దేవి, లక్ష్మీ శ్రావణి, ప్రణతి ఇప్పటికే టాప్ 12 జాబితాలో ఉన్నారు. ఈ 12 మందితో తెలుగు ఇండియన్ ఐడిల్ అసలు కథ మొదలు కాబోతోంది. ఇందుకోసం భారీ స్టేజ్ ను ఏర్పాటు చేశారు. వచ్చే వారం నుండి జడ్జిలే కాకుండా వ్యూవర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆట, పాటలతో పాటు గెస్టులనూ స్టేజ్ మీదకు తీసుకొస్తున్నారు. వచ్చే ఎపిసోడ్ లో సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ రైటర్ రామ్ మిర్యాల తెలుగు ఇండియన్ ఐడిల్ లో పాల్గొంటున్నాడు. ఇక టాప్ 12 కంటెస్ట్స్ ను వేదిక మీద పరిచయం చేస్తూ, తమన్ డ్రమ్స్ వాయిస్తే, కార్తీక్ ‘ఒకమారు కలిసిన అందం’ పాట పాడి ఆకట్టుకున్నాడు. దాంతో అందరూ కలిసి సరదాగా అతనితో స్టెప్పులేశారు.
ఆహా భోజనంబు…
ఆహాలో తెలుగు ఇండియన్ ఐడిల్ కేవలం పాటల పోటీలా కాదు… ఫుడ్ కు సంబంధించిన పోటీలానూ ఉంది. తమన్ మినహా మిగిలిన ఇద్దరు న్యాయనిర్ణేతలు నిత్యామీనన్, కార్తీక్ బెస్ట్ ఫుడ్డీస్ అని కంటెస్టెంట్స్ కు తెలిసిపోయినట్టుగా ఉంది. వాళ్ళకు మంచి మంచి తినుబండారాలు తెచ్చి పెడుతున్నారు. మొదటిసారి మాన్య చంద్రన్ తిరుపతి నుండి వస్తూ లడ్డూలు తీసుకొస్తే, ఈ సారి ఆమె తల్లి శాలువాలు తీసుకొచ్చి, జడ్జీలను సత్కరించింది. ఇక జయంత్ తల్లి అయితే ఏకంగా బిర్యానీ వండి పెద్ద క్యారియర్లో తెచ్చిపెట్టింది. శివకుమార్ జడ్జీల కోసం 70 ఎం.ఎం. దోసే తీసుకొచ్చాడు. కంటెస్టెంట్స్ బంధువులను, స్నేహితులను సైతం వేదిక మీదకు తీసుకొచ్చి వీక్షకులకు పరిచయం చేయడం బాగుంది. అలానే ఎలిమినేట్ అయిన వారు బాధకుండా వాళ్ళను తన మాటలతో తమన్ చక్కగా ఓదార్చుతున్నాడు. మరీ ముఖ్యంగా న్యాయనిర్ణేతలు ముగ్గురికీ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండటంతో అరేయ్, ఒరేయ్, ఏరా, పోరా అంటూ మనసు విప్పి మాట్లాడుకుంటూ షోను రక్తికట్టిస్తున్నారు. దాంతో అంతా ఒకే కుటుంబమనే భావన అందరిలో కలుగుతోంది. నిజానికి శ్రీరామచంద్ర విశ్వరూప ప్రదర్శన ఇంకా మొదలు కాలేదు. ఇప్పటి వరకూ ఆటలో అరటి పండులానే ఉన్నాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్ కీలకమైనవి కావడంతో అక్కడ అతని అసలు టాలెంట్ బయటకు వచ్చే ఆస్కారం ఉంది. సో… పిక్చర్ అభీ బాకీ హై!
