Site icon NTV Telugu

Telugu Indian Idol: రెట్రో స్పెషల్ తో అదరగొట్టేశారు!

Retro Special

Retro Special

తెలుగు ఇండియన్ ఐడిల్ ఒక్కో వీకెండ్ ఒక్కో స్పెషల్ తో జనం ముందుకు వస్తోంది. గత వారం ఎస్పీబీ స్పెషల్ తో అలరించిన సింగర్స్… ఈ వారం రెట్రో స్పెషల్ తో ఆకట్టుకున్నారు. విశేషం ఏమంటే… వారి కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ గా థీమ్ కు తగ్గట్టుగా వున్నాయి. ఇక షో హోస్ట్ శ్రీరామచంద్ర అయితే చెక్క గుర్రాన్ని వేదిక మీదకు తీసుకొచ్చి బోలెడంత కామెడీ పండించాడు. అంతేకాదు… ఒక్కో సింగర్ ను పిలిచే ముందు… ఒక్కో పాత హీరోను అనుకరిస్తూ నవ్వుల పువ్వులు పూయించాడు. తొలుత వైష్ణవి ‘యుగంధర్’ మూవీలోని ‘నా పరువం… నీ కోసం’ పాటను సూపర్బ్ గా పాడింది. దాంతో న్యాయనిర్ణేతలు తమన్, నిత్యా మీనన్, కార్తీక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబిచ్చారు. ‘జడ్జీలు ముగ్గురిలో ఎవరు డాన్ లా కనిపిస్తున్నార’ని వైష్ణవిని శ్రీరామ్ అడగ్గానే తడుముకోకుండా తమన్ పేరు చెప్పింది. డాన్ గెటప్ లో తమన్ ఎలా ఉంటాడో వెనక స్క్రీన్ మీద ఫోటోలో చూపించారు. అందులో తనను చాలా స్లిమ్ గా చూపించడాన్ని తమన్ సైతం ఎంజాయ్ చేశాడు. ఈ శుక్రవారం ఎపిసోడ్ కు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గెస్ట్ గా వచ్చాడు. అతను నటిస్తున్న ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీ మే 6న విడుదల కాబోతోంది. సింగర్ కార్తిక్ అంటే తనకెంతో ఇష్టమని, ‘పాగల్’ సినిమాలో అతనితో పాట పాడించే ఛాన్స్ దక్కిందని విశ్వక్ సేన్ చెప్పాడు.

Watch Acharya Pre release Event Live :

విశ్వక్ తో మాస్ స్టెప్పులేసిన లాలస!
సెకండ్ కంటెస్టెంట్ గా వేదిక మీదకు వచ్చిన లాలస ‘దేవుడు చేసిన మనుషులు’ మూవీలో ఎల్. ఆర్. ఈశ్వరి పాడిన ‘మసక మసక చీకటిలో’ గీతాన్ని ఆలపించింది. అంతేకాదు… విశ్వక్ ను అడిగి మరి అతనితో కలిసి స్టేజ్ మీద మాస్ స్టెప్పులేసింది. విశ్వక్ డాన్స్ కు పదికి పది మార్కులు వేస్తున్నట్టు నిత్యామీనన్ చెప్పింది. ఆ తర్వాత వచ్చిన శ్రీనివాస్ ‘అందమైన అనుభవం’లోని ‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు’ పాటను పాడాడు. హైపిచ్ లో పాడటం బాగానే ఉంది కానీ అప్‌ టూ ద మార్క్ లేదని జడ్జీలు తేల్చేశారు. దాంతో కాస్తంత చల్లబడిన శ్రీనివాస్ లో విశ్వక్ సేస్ లవ్ మేటర్ గుర్తు చేసి జోష్ నింపాడు. శ్రీనివాస్ ప్రేమిస్తున్న అమ్మాయి ఫోటోను రివీల్ చేశాడు. తన ప్రియురాలు స్నేహతో వచ్చే యేడాది వివాహం ఉంటుందని శ్రీనివాస్ కూడా చెప్పేశాడు. ఆ తర్వాత వచ్చిన రేణు కుమార్ ‘విచిత్ర సోదరులు’లోని ‘బుజ్జి పెళ్ళి కొడుక్కి రాజయోగమురా’ పాట పాడాడు. అయితే అతను కూడా అనుకున్నంత బాగా పాడలేదని తమన్, కార్తీక్, నిత్య చెప్పారు. పాట సెలక్షన్ బాగున్నా… దానికి తగ్గ జోష్ మిస్ అయ్యిందని అభిప్రాయ పడ్డారు. ఆ తర్వాత పెళ్ళికి ముందు ఆ తర్వాత లైఫ్‌ ఎలా ఉంటుందో రేణు కుమార్ ను అడిగి తెలుసుకున్నాడు విశ్వక్ సేన్. పెళ్ళికి ముందు మణిరత్నం మూవీలానూ, ఆ తర్వాత బోయపాటి సినిమాలానూ ఉంటుందని చెప్పాడు రేణు.

జయంత్ కోసం విశ్వక్ బిర్యానీ!
ఈ శుక్రవారం చివరగా జయంత్ ‘చైతన్య’ మూవీలోని ‘ఓహో లైలా….’ పాటను పాడాడు. ఫుల్ కాన్ఫిడెన్స్ తో అతను పాడిన పాట నచ్చిన జడ్జీలు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. జయంత్ కు బిర్యానీ అంటే ఇష్టమని తెలుసుకున్న విశ్వక్ సేన్ తన ఇంటి నుండి క్యారియర్ లో తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత మరోసారి జయంత్ తో కలిసి విశ్వక్ డాన్స్ చేశాడు. చివరగా విశ్వక్ తన కొత్త సినిమా గురించి చెబుతూ, ‘ఇంతవరకూ మాస్ పాత్రలు చేసిన తాను తొలిసారి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో అందుకు భిన్నమైన పాత్ర చేశానని అన్నాడు. ఈ సినిమా అరిటాకు భోజనంలా ఉంటుందని, అందరూ ఫ్యామిలీ పాటు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చని హామీ ఇచ్చాడు. మొత్తం మీద రెట్రో స్పెషల్ తొలిరోజు చక్కని పాటలతో అదిరిపోయింది.

Exit mobile version