Telangana Chamber Opposes Producer Guild Decision:
తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమాల చిత్రీకరణల్ని నిలిపివేస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే! అయితే.. ఈ నిర్ణయంపై తెలంగాణ ఛాంబర్ నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడైన నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘మా ఛాంబర్‌లో 50 మంది వరకు నిర్మాతలున్నారు. వారి సినిమాల చిత్రీకరణలు కొనసాగుతున్నాయి. గిల్డ్ నిర్మాతలేమో ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణల్ని బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. అదంతా వారి స్వార్థం కోసమే. మేము మా సినిమాల చిత్రీకరణల్ని ఆపేదే లేదు. చిత్ర పరిశ్రమ కేవలం నలుగురిది మాత్రమే కాదు.. అందరినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి’’ అని అన్నారు.
అంతేకాదు.. సడెన్‌గా షూటింగ్స్ ఆపేస్తే వర్కర్స్ ఇబ్బంది పడతారని ఆర్కే గౌడ్ అన్నారు. గిల్డ్ నిర్మాతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ సినిమాల్ని గిల్డ్ నిర్మాతలు ఎక్కువ రేట్లకు ఓటీటీలకు అమ్ముకున్నారన్నారు. టికెట్ ధరలు పెంచమంది వారే.. ఇప్పుడు థియేటర్‌లకు ప్రేక్షకుల రావటం లేదని వాపోతోందీ వారేనని వ్యాఖ్యానించారు. ఆర్టిస్ట్‌లకు రెమ్యునరేషన్ పెంచింది కూడా గిల్డ్ నిర్మాతలేనని, ఇప్పుడు తగ్గించుకోవాలని రిక్వెస్టులు చేసుకుంటున్నారన్నారు. సినిమాల టికెట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేసిన ఆర్కే గౌడ్.. పర్సంటేజ్ విధానం కూడా రావాలని కోరారు. తమ సినిమాల చిత్రీకరణల్ని ఆపితే.. ఊరుకునేదే లేదని ఆర్కే గౌడ్ హెచ్చరించారు.
