Site icon NTV Telugu

Teachers’ Day Special : తెరపై గురువులు!

Teachers Day Special

Teachers Day Special

‘గురువు’ అంటే చీకటిని పారద్రోలేవారు అని అర్థం. తల్లి, తండ్రి తరువాత అందుకే గురువుకే ప్రాధాన్యమిచ్చారు. గురువును సాక్షాత్ పరబ్రహ్మంతోనూ పోల్చారు. సెప్టెంబర్ 5వ తేదీని యావద్భారతమూ ఉపాధ్యాయ దినోత్సవంగా భావించి, గురుపూజ్యోత్సవం చేసుకుంటూ ఉండడం ఓ సంప్రదాయంగా మారింది. ఆ నాటి రాష్ట్రపతి, మన తెలుగువారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజయిన సెప్టెంబర్ 5ను అనేక సంవత్సరాలుగా గురుపూజ్యోత్సవం చేసుకుంటున్నాం. మన సినిమాల్లోనూ అగ్రనటులు కొందరు పంతుళ్ళ పాత్రల్లో అలరించారు. ఒకప్పుడు పాఠశాలలో పనిచేసే పంతుళ్ళ పాత్రలే ఎక్కువగా తెరపై కనిపించాయి. తరువాతి రోజుల్లో విద్య బోధించి, విద్యార్థుల్లో చైతన్యం తీసుకు వచ్చే అధ్యాపక పాత్రలూ తెరపై కనిపించి ఆకట్టుకున్నాయి.

నటరత్న యన్టీఆర్ అనేక చిత్రాలలో ఉపాధ్యాయునిగానూ, అధ్యాపకునిగానూ నటించి అలరించారు. “మిస్సమ్మ, వివాహబంధం, దేవత, పుణ్యవతి, బడిపంతులు, విశ్వరూపం” వంటి చిత్రాలలో రామారావు పంతులుగానూ, పాఠాలు చెప్పే లెక్చరర్ గానూ కనిపించి ఆకట్టుకున్నారు. నటసమ్రాట్ ఏయన్నార్ “సుమంగళి, తాండవకృష్ణుడు, గురుబ్రహ్మ” వంటి చిత్రాలలో పాఠాలు చెప్పే పాత్రల్లో నటించి అలరించారు. ‘బలిపీఠం’ చిత్రంలో శోభన్ బాబు పంతులుగా నటించారు. ‘అమ్మమాట’లోనూ హీరోయిన్ కు పాఠాలు చెప్పే పాత్ర ధరించారు శోభన్. ‘మనుషులు-మట్టిబొమ్మలు’లో కృష్ణ స్కూల్ టీచర్ గా కనిపించారు. కృష్ణంరాజు ‘త్రిశూలం’లో మాస్టారుగా ఆకట్టుకున్నారు. ‘పిచ్చిపంతులు’లో మురళీమోహన్ పంతులుగానే నటించారు. ‘మూడుముళ్ళు’ చిత్రంలో చంద్రమోహన్ కూడా స్కూల్ టీచర్ గా కనిపించారు.

తరువాతి తరం హీరోల్లో చిరంజీవి ‘మాస్టర్’లో లెక్చరర్ గా కనిపిస్తే, బాలకృష్ణ ‘సింహా’లో అధ్యాపకునిగా నటించారు. వెంకటేశ్ ‘సుందరకాండ’లో లెక్చరర్ గా అభినయించారు. ‘గీతగోవిందం’లో విజయ్ దేవరకొండ కూడా అధ్యాపకునిగా నటించి ఆకట్టుకున్నారు. ఇలా పలు తరాల హీరోలు పంతుళ్ళుగానూ, అధ్యాపకులుగానూ నటించి జనాన్ని మురిపించారు. వీరేకాదు ఎందరో హీరోలు తెరపై పాఠాలు చెప్పి ఆకట్టుకున్న సందర్భాలున్నాయి. ఈ టీచర్స్ డే సందర్భంగా కాసేపు వీరందరినీ గుర్తు చేసుకున్నాం. మీకు కూడా ఎవరైనా ప్రముఖ నటులు పంతుళ్ళ పాత్రలో అలరించిన చిత్రాలు గుర్తుకు వస్తే సదరు సినిమాలను ఈ సందర్భంగా మననం చేసుకోండి.

Exit mobile version