హిందూ ధర్మం, ఆధ్యాత్మిక అంశాలు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం… ఇలాంటివి సినిమా వాళ్ళకు పెద్ద పట్టవనే భావన చాలా మందిలో ఉంది. సినిమాల్లో అవకాశం దొరికినప్పుడల్లా దొంగ బాబాలను, స్వామీజీలను చూపిస్తుంటే… దర్శక నిర్మాతలు ఫక్తు హేతువాదులేమో అనే భ్రమ పడుతుంటాం. కానీ అవన్నీ నిజాలు కావు. నిజానికి సినిమా వాళ్ళకు ఉన్నంత మూఢ భక్తి, మూఢ నమ్మకం ఇతర రంగాలలో చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఓ ప్రముఖ న్యూమరాలజిస్టు గురించే!
తెలుగులో పలు అంశాలలో మాస్టర్ డిగ్రీ సంపాదించిన ఒకాయన ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమరాలజీ లో కొంత పట్టు సంపాదించారు. దానికి తోడు మాట చాతుర్యం ఉండనే ఉంది. దాంతో తన ప్రతిభను టాలీవుడ్ లోని దర్శక నిర్మాతలపై ప్రయోగించారు. అలా ఆ బాబు గారి ఇన్ ఫ్లుయెన్స్ కు కొంతమంది లోనయ్యారు. సినిమా ముహూర్తాలు పెట్టడంలోనే కాదు… ఏ హీరోకు ఏ రోజున కథ చెప్పాలో కూడా సదరు బాబుగారే నిర్ణయిస్తాయరట. చిత్రం ఏమంటే… సహజంగా న్యూమరాలజిస్ట్ దగ్గరకు ఎవరైనా ఏదైనా సమస్యతో వెళితే, వారికి కలిసి వచ్చే సంఖ్యనో, రంగునో, రోజునో చెబుతారు. లేదంటే పేరులో అదనంగా ఒకటి రెండు అక్షరాలను జత చేయమని సలహా ఇస్తారు. కానీ సదరు బాబుగారు సినిమా వాళ్ళకు లక్కీ ఫోన్ నంబర్స్, లక్కీ బ్యాంక్ అక్కౌంట్ నంబర్స్, లక్కీ పాస్ వర్డ్ చెబుతున్నారట. అంటే మన దర్శక నిర్మాతలు, నటీనటుల ఆర్థిక లావాదేవీలన్నీ బాబుగారి చేతిలోనే ఉంటాయి. ఇక దర్శక నిర్మాతలకు ఏ హీరోను ఏ రోజు కలిసి కథ చెప్పాలో కూడా బాబుగారే నిర్ణయిస్తారట. సరే… నమ్మే వాళ్ళు నమ్ముతారు. నమ్మని వారు నమ్మరు.
చిత్రం ఏమంటే… టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళలోనూ ఈ బాబుగారు పాగా వేశారు. అక్కడా కాస్తంత పట్టు సంపాదించారు. ఆ మధ్య క్యాన్సర్ తో హాస్పిటల్ లో చేరిన ఓ సీనియర్ హిందీనటుడి అనారోగ్యాన్ని తన శక్తితోనే బాబుగారు తగ్గించేశారనే ప్రచారం ఇప్పుడు బాలీవుడ్ లో బాగా సాగుతోంది. నిజంగా అలాంటి అద్భుతం జరిగితే మంచిదే! కానీ అదే వ్యక్తి ఓ పాన్ ఇండియా మూవీ క్లాప్ కొట్టిన రోజునే ఆ సినిమా సెట్ అగ్నికి ఆహుతి అయిపోయిందనే వార్తలు వచ్చాయి. అలానే తెలుగులో ఓ క్రియేటివ్ డైరెక్టర్ ఈ బాబుగారి సలహాతోనే లేక లేక ఓ రీమేక్ మూవీని మొదలెట్టారు. అది ఇప్పుడు పూర్తి కాకుండా నానా ఇబ్బందులూ పడుతున్నారట. మరో పాపులర్ డైరెక్టర్ కూడా ఈ బాబుగారి సలహాలే పాటిస్తారట. ఆయనకేమో సినిమాలే లేకుండా పోయాయి. మరి ఇంత నెగెటివ్ రిమార్క్స్ ఉన్నా కానీ చాలా మంది దర్శకనిర్మాతలు, నటీనటులు గుడ్డిగా ఆ బాబుగారి సలహాలను ఫాలో అవుతున్నారంటే సినిమా వాళ్ళు ఎంత మానసిక బలహీనులో అర్థమౌతుంది.
సో… తెర మీద హిందూ ధర్మాన్ని తెలిసో తెలియకో విమర్శించే దర్శక నిర్మాతల్లో చాలామంది చిత్రంగా… దొంగ బాబాలు, దొంగ ఆధ్యాత్మిక వేత్తలు చెప్పే మాటలకే పడిపోతారేమో అనిపిస్తోంది.
