NTV Telugu Site icon

Krishna – Actress: కృష్ణ సరసన నటించిన భామలు!

Krishna And Heroines

Krishna And Heroines

Krishna – Actress: నటశేఖరుని సరసన ఎందరు నటించినా, ఆయన సతీమణి, ఆయన విజయనాయిక విజయనిర్మలదే పైచేయి. దాదాపు నలభైకి పైగా చిత్రాలలో కృష్ణతో జోడీ కట్టారామె. ఆ తరువాత మూడువందల పై చిలుకు చిత్రాల్లో నటించిన కృష్ణ సరసన వందలాది మంది నాయికలు తళుక్కుమన్నారు. వారిలో విజయనిర్మల తరువాతి స్థానం జయప్రదకే దక్కుతుంది. ఆమె కూడా ఆయన సరసన నలభై చిత్రాలలో నటించారు. ఇంతకూ కృష్ణ సరసన నటించిన తొలి నాయిక ఎవరు? ఈ ప్రశ్నకు సుకన్య అనే సమాధానం వస్తుంది. ఆదుర్తి సుబ్బారావు 1965లో తెరకెక్కించిన ‘తేనెమనసులు’లో ఇద్దరు హీరోల్లో ఒకరిగా కృష్ణ నటించారు. అందులో ఆయనకు జోడీగా సుకన్య కనిపించారు. రెండో చిత్రం ‘కన్నెమనసులు’లో సంధ్యారాణి ఆయనతో జోడీకట్టారు. మూడో సినిమా ‘గూఢచారి 116’లో ఏకంగా అప్పటి క్రేజీ హీరోయిన్ జయలలిత ఆయన జంటగా నటించారు. ఐదో చిత్రం ‘సాక్షి’లో తొలిసారి విజయనిర్మలతో జోడీగా నటించి మురిపించారు కృష్ణ. ఆ తరువాత వాణిశ్రీ, రాజశ్రీ వంటి యంగ్ హీరోయిన్స్ తోనూ అలరించారు. తనకంటే సీనియర్ అయిన జమునతోనూ జంటగా నటించారు కృష్ణ. ఆ పై కాంచన, శారద, భారతి వంటి నాయికలతో పాటు నృత్యతారలుగా అలరిస్తోన్న విజయలలిత, జ్యోతిలక్ష్మితోనూ హీరోగా నటించి ఆకట్టుకున్నారు.

ఎవరితో నటించినా, కృష్ణ హిట్ పెయిర్ గా విజయనిర్మలనే నిలిచారు. ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన “మోసగాళ్ళకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు” చిత్రాలలో విజయనిర్మలనే నాయికగా నటించడం గమనార్హం! విజయనిర్మల తరువాత కృష్ణ సరసన ఎక్కువ సినిమాల్లో నాయికగా నటించిన జయప్రద ఆయనతో తొలిసారి ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’లో హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత వారిద్దరూ నటించిన చిత్రాలలో “ఈ నాటి బంధం ఏ నాటిదో, దొంగలకు దొంగ, దొంగల వేట, అల్లరి బుల్లోడు, కుమార రాజా, అతనికంటే ఘనుడు, కొత్త అల్లుడు, కొత్త పేట రౌడీ, శంఖుతీర్థం, భలే కృష్ణుడు, ఊరికి మొనగాడు, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి, ముందడుగు, ప్రజారాజ్యం” వంటి సినిమాలున్నాయి. వీరిద్దరూ లోక్ సభకు ఎంపీలుగానూ ఎన్నిక కావడం విశేషం!

కృష్ణ సరసన జయచిత్ర, జయసుధ వంటి వారితో పాటు శ్రీదేవి, రాధ వంటి తారలూ భలేగా మురిపించారు. ఎందరో వర్ధమాన నాయికలు ఆ రోజుల్లో కృష్ణతో నటిస్తే చాలు మంచి పేరు లభిస్తుందని ఆశించేవారు. లేడీ సూపర్ స్టార్ గాజేజేలు అందుకున్న విజయశాంతి తొలిసారి కృష్ణ సరసనే ‘కిలాడీ కృష్ణుడు’లో నాయికగా నటిస్తూ చిత్రసీమకు పరిచయం కావడం విశేషం! అంబిక, భానుప్రియ, రంభ, రోజా, సౌందర్య, రమ్యకృష్ణ వంటివారు కూడా కృష్ణ సరసన నటించి ఆకట్టుకున్నారు. ఆయన చివరగా హీరోలా కనిపించిన చిత్రం ‘శ్రీ శ్రీ’ అందులోనూ విజయనిర్మలనే నాయిక కావడం విశేషం! దాదాపు నాలుగైదు తరాల తారలతో జోడీ కట్టి అలరించారు కృష్ణ. తన నాయికలతో పాటల్లో కృష్ణ చేసిన గమ్మత్తులు ఇప్పటికీ బుల్లితెరపై అడపాదడపా ప్రత్యక్షమై అభిమానులకు ఆనందం పంచుతూనే ఉంటాయి.