Sumanth: ఎక్కడ పారేసుకున్నామో, అక్కడే వెదుక్కోవాలని సామెత! హీరో సుమంత్ మనసు చిత్రసీమలోనే చిక్కుకుంది. దాంతో సుమంత్ సినిమా రంగంలోనే పయనం సాగిస్తున్నారు తప్ప పక్కకు తిరిగి చూడడం లేదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా సుమంత్ కెరీర్ సాగుతోంది. సుమంత్ తో సినిమాలు తీయడానికి వచ్చే నిర్మాతల అభిరుచి సైతం ఆయనకు తగ్గట్టుగానే ఉండడం విశేషం! తాత అక్కినేని నాగేశ్వరరావు పోలికలతో ఆరడగులకు పైగా ఎత్తులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ సుమంత్ సొంతం. తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున బాటలోనే వైవిధ్యమైన పాత్రలతో సాగడం ఆరంభించారు సుమంత్. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో హీరోగా పరిచయమైన సుమంత్ కు ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిగా ముందుకు సాగి ‘సత్యం’తో అసలు సిసలు విజయాన్ని అందుకున్నారు సుమంత్. అప్పటి నుంచీ తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారాయన.
యార్లగడ్డ సుమంత్ కుమార్ 1975 ఫిబ్రవరి 9న జన్మించారు. ఆయన తండ్రి యార్లగడ్డ సురేంద్ర, తల్లి అక్కినేని సత్యవతి. ఏయన్నార్ పెద్ద కూతురు సత్యవతి కుమారుడే సుమంత్. 1975లో గుండెకు శస్త్ర చికిత్స జరగడం వల్ల ఏయన్నార్ ఇంటివద్దనే విశ్రాంతి తీసుకున్నారు. అప్పట్లో ఆయనకు చిన్నారి సుమంత్ పెద్ద కాలక్షేపం. మనవడితో ఆడుకుంటూ మళ్ళీ హుషారుగా ‘సెక్రటరీ’ చిత్రంలో నటించారు ఏయన్నార్. చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణం చూడటం వల్ల సుమంత్ లోనూ నటనాభిలాష ఉండేది. అయితే దానిని బయట పెట్టలేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదోతరగతి వరకు చదువుకున్న సుమంత్, తరువాత ఇంటర్ పూర్తయ్యాక మిచిగాన్ లో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారు. అక్కడ రెండేళ్ళు చదివాక చికాగోలోని కొలంబియా కాలేజ్ లో బి.ఏ.ఇన్ ఫిలిమ్ స్టడీస్ చేశారు. నటనలో పట్టు సాధించిన సుమంత్, స్వదేశం వచ్చాక తాత, తండ్రి, మేనమామ ఆశీస్సులతో ‘ప్రేమకథ’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే మేనమామ నాగార్జున మాత్రం సుమంత్ ను హీరోగా నిలిపేంత వరకు అతనితో సినిమాలు నిర్మిస్తూనే వచ్చారు. ‘ప్రేమకథ’ తరువాత ‘యువకుడు’ తెరకెక్కించారు. అదీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత తాతతో కలసి ‘పెళ్ళిసంబంధం’లోనూ, మేనమామతో కలసి ‘స్నేహమంటే ఇదేరా’లోనూ నటించారు సుమంత్. ఆ సినిమాలు సైతం అంతగా మురిపించలేక పోయాయి. మళ్ళీ సుమంత్ తో నాగార్జున నిర్మించిన ‘సత్యం’తో అతనికి తొలి సక్సెస్ దక్కింది. సుమంత్ చెల్లెలు సుప్రియ కూడా కొన్ని చిత్రాలలో నటించారు. సుమంత్ తండ్రి సురేంద్ర “రావుగారిల్లు, శివ, కలెక్టర్ గారి అబ్బాయి, గాయం” వంటి చిత్రాలు నిర్మించారు.
‘సత్యం’ సక్సెస్ తరువాత సుమంత్ “గౌరీ, ధన 51, మహానంది, గోదావరి, చిన్నోడు, క్లాస్ మేట్స్, మధుమాసం, పౌరుడు, గోల్కొండ హైస్కూల్, ఏమో గుర్రం ఎగరావచ్చు, నరుడా డోనరుడా, మళ్ళీ రావా, సుబ్రహ్మణ్య పురం, ఇదం జగత్, కపటధారి” చిత్రాల్లో నటించారు. యన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన “కథానాయకుడు, మహానాయకుడు” చిత్రాల్లో తాత ఏయన్నార్ లా కనిపించారు సుమంత్. ఆ పై “కపటధారి, మళ్ళీ మొదలైంది” చిత్రాలలో హీరోగా నటించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన ‘సీతారామమ్’లో కీలక పాత్రలో కనిపించారు సుమంత్. ప్రస్తుతం “అనగనగా ఒక రౌడీ, వారాహి” చిత్రాల్లో నటిస్తున్నారు సుమంత్. ‘అనగనగా ఒక రౌడీ’లో వాల్తేరు శీను అనే పక్కా మాస్ పాత్రలో కనిపించనున్నారాయన. ‘వారాహి’లోనూ విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ చిత్రాలతో సుమంత్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి.