కృష్ణగారి అల్లుడు, మహేశ్ బాబు బావ సుధీర్ బాబు. ‘ఎస్.ఎమ్.ఎస్.’ మూవీతో పదేళ్ళ క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ దశాబ్దకాలంలో వైవిధ్యమైన చిత్రాలు ఎన్నో చేశాడు. అంతేకాదు బాలీవుడ్ లోకి ‘బాగీ’ చిత్రంతో అడుగుపెట్టాడు. అయితే… గత వారం జనం ముందుకు వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో తనకు అవకాశం వచ్చిందని, అయితే ఆ సమయంలో ‘సమ్మోహనం’ మూవీతో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ వదిలేసుకున్నానని సుధీర్ బాబు తెలిపాడు. నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఈ మూవీ విశేషాలతో పాటు పలు అంశాల గురించి సుధీర్ బాబు మీడియాకు వివరించాడు.
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం. దాంతో దర్శకుడి గురించి చెబుతూ, ”ఈ మూవీ ట్రైలర్ లో ఒక డైలాగ్ వుంది. ‘మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం. కానీ సినిమానే మనల్ని తీస్తుంది’ అని. వాస్తవానికి మా కాంబినేషన్ వలన ఈ సినిమా జరగలేదు. సినిమానే మమ్మల్ని ఎంపిక చేసుకుంది. ఆయన నన్ను యాక్టర్ గా నమ్మారు. నేను ఆయన కథల్ని నమ్మాను. ఆయన ఒక కాంబినేషన్ ని సెట్ చేసుకోవాలనుకునే దర్శకుడు కాదు. ఒక హిట్ ఇచ్చిన వెంటనే ఒక పెద్ద స్టార్ కోసం ఎదురు చూస్తారు. కథలు రాస్తారు. కానీ ఆయన మాత్రం ఒక కథని రాసుకొన్న తర్వాత దానికి ఎవరు నప్పుతారో చూస్తారు. ఆయన నాతో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు. ఇటీవల తాను నటించిన ‘సమ్మోహనం’కు దీనికి ఎలాంటి పోలికా ఉండదని చెబుతూ, ”ఈ రెండు సినిమాలకూ అసలు పోలికే ఉండదు. ఇది కూడా సినిమా నేపథ్య చిత్రమే కానీ ఇది పూర్తిగా భిన్నమైంది. చాలా ఫ్రెష్ గా వుంటుంది. ‘సమ్మోహనం’లో సంఘర్షణ అమ్మాయి – అబ్బాయి మధ్యనే వుంటుంది. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లో కుటుంబాల మధ్య సంఘర్షణ వుంటుంది. చాలా డిఫరెంట్ గా వుంటుంది” అని వివరించారు. కృతిశెట్టి గురించి చెబుతూ, ”ఆమె తొలి చిత్రం ‘ఉప్పెన’కి ముందే ఎంపిక చేశాం. తను చాలా మంచి నటి. ఒక పాత్రని అర్ధం చేసుకోవడంలో చాలా పరిణితి కనబరుస్తుంటుంది. ‘ఉప్పెన’తో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాతో ఏ పాత్రైనా చేయగలననే నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నా. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా వుంటాయి. ఇక ఇంద్రగంటి విషయానికి వస్తే ఆయన ప్రెజెంటేషన్ స్టయిల్ గా వుంటుంది. ఎక్కువ సినిమా స్వేచ్ఛ తీసుకోకుండా, రియల్ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఇస్తారు. డైలాగ్స్ నేచురల్ గా వుంటాయి. పాత్రలు మనచుట్టూ ఉన్నట్లే వుంటాయి” అని చెప్పారు.
దర్శకత్వం ఆలోచన గురించి సుధీర్ బాబు వివరిస్తూ, ”నేను చాలా మంది కొత్త దర్శకులతో పని చేశా. నాకు తెలియకుండానే దర్శకులు చేసే కొన్ని పనులు చేశాను. తప్పని పరిస్థితులలో ఏవో సీన్స్, డైలాగ్స్ రాయడం, షూటింగ్ చూసుకోవడం కారణంగా అనుకోకుండానే దర్శకత్వం వైపు ఒక ఆసక్తి ఏర్పడింది. అయితే డైరెక్షన్ ఎప్పుడు చేస్తానో తెలీదు. ఇప్పటికైతే నా దృష్టి నటనపైనే వుంది” అని అన్నారు. తాను చేయబోతున్న కొత్త సినిమాల గురించి చెబుతూ, ”’హంట్’, ‘మామామశ్చీంద్ర’, యూవీ క్రియేషన్స్ సినిమా, అలాగే ‘సెహరి’ దర్శకుడు జ్ఞానసాగర్ తో ఓ సినిమా చేస్తున్నా. ‘మామామశ్చీంద్ర’ ఇంకో ఇరవై రోజులు షూట్ వుంది. ‘హంట్’ సినిమాకి మార్వెల్ సిరిస్ కి చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేశారు” అని అన్నారు.
