తెలుగు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన గాసిప్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం టాలీవుడ్ లోనే కాక ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా ముద్రపడిన ఒక ‘స్టార్ హీరో – స్టార్ డైరెక్టర్’ జోడీ మధ్య ఇప్పుడు అంతర్గత విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ సినిమా సీక్వెల్ విషయంలో వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు తలెత్తాయని టాక్ నడుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కేవలం ఒక్క భాగంతో ముగించకుండా ఫ్రాంచైజీగా మార్చి ‘పార్ట్-2’ కూడా చేయాలని సదరు స్టార్ హీరో తీవ్రంగా పట్టుబడుతున్నారు.
కానీ, దర్శకుడు మాత్రం ఈ ఆలోచనపై అస్సలు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కథ ప్రకారం ముందు నుంచీ ఇది ఒకే పార్ట్‌గా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో, సీక్వెల్ చేయడానికి ఆయన వద్ద సరైన ఐడియా గానీ, ఆసక్తి గానీ లేవని సమాచారం. సీక్వెల్ ఆలోచనే కాకుండా, ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో కూడా వీరిద్దరి మధ్య తీవ్రమైన క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. సీన్స్ మేకింగ్ విషయంలో హీరో చెప్పే మార్పులకు డైరెక్టర్ విముఖత చూపడం, అలాగే డైరెక్టర్ విజన్‌తో హీరో పూర్తిగా ఏకీభవించకపోవడంతో సెట్స్‌లో ఈగో వార్ నడుస్తోందని టాలీవుడ్ ఇన్‌సైడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి ఇటువంటి వార్తలు బయటకు రావడం అభిమానులను కాస్త కలవరానికి గురిచేస్తోంది. మరి సదరు స్టార్ హీరో తన మాటతో దర్శకుడిని ఒప్పించి ‘పార్ట్-2’కి గ్రీన్ సిగ్నల్ ఇప్పిస్తారా? లేక వీరి కాంబినేషన్ ఈ ఒక్క సినిమాతోనే ముగిసిపోతుందా? అనేది వేచి చూడాలి.

