Varanasi: బర్త్‌డేకు ‘వారణాసి’ ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్

Varanasi (1)

Varanasi (1)

Varanasi: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ ‘వారణాసి’. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటకే ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచగా, ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9పై పడింది. ఈసారి అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఉంటుందా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినిమా నుంచి భారీగా ఆశించారు. అయితే ఆ సమయంలో రాజమౌళి ఎలాంటి కంటెంట్‌ను విడుదల చేయలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అనంతరం చిత్రబృందం మరికొంత సమయం తీసుకుని నవంబర్‌లో ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఆ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చినప్పటికీ, బర్త్‌డే రోజున ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఇప్పుడు ఈ సినిమా విడుదలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉండటంతో పుబ్లిసిటీ కార్యక్రమాలు వేగం పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాన్ని ఉపయోగించుకుని ఒక చిన్న టీజర్, లేదా రుద్ర పాత్రకు సంబంధించిన ప్రత్యేక వీడియో విడుదల చేయాలని అభిమానులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. రాజమౌళి క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారనే విషయం తెలిసిందే. కంటెంట్ పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడాన్ని ఆయన ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. అయినప్పటికీ ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి వీడియో అయినా విడుదల చేస్తే అభిమానులకు అది ప్రత్యేక కానుకగా నిలిచే అవకాశం ఉంది.

పౌరాణిక అంశాలు, యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే అంతకుముందు ఆగస్టు 9న రాజమౌళి అభిమానులకు ఏదైనా ప్రత్యేక ట్రీట్ ఇస్తారా లేదా అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికర చర్చగా మారింది.