Director SS Rajamouli appointed as ISBC Chairman: ‘దర్శకధీరుడు’ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తెలుగోడి సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆరుగురు సభ్యులకు ఆస్కార్ కమిటీలో అవకాశం కూడా లభించింది. తాజాగా రాజమౌళికి మరో గౌరవం దక్కింది.
ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌బీసీ) నూతన చైర్మన్‌గా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నియమితులు అయ్యారు. ఇప్పటికే ఐఎస్‌బీసీకి జాయింట్ సెక్రెటరీగా రాజమౌళి కుమారుడు కార్తికేయ ఉన్నారు. త్వరలోనే ఐఎస్‌బీసీ చైర్మన్‌గా రాజమౌళి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సంస్థకు చీఫ్ ప్యాట్రన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఉండగా.. వెటరన్ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కారు ప్రధాన సలహాదారు. ఇండియాలో స్కూల్ క్రికెటర్లు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఓ వేదికను అందించడంతో పాటు, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించేందుకు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ మార్గనిర్దేశంలో ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌బీసీ) ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఇక రాజమౌళి కొత్త రోల్ పోషించేందుకు సిద్ధమవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కోసం మెగా ఫోన్ పట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు బ్యాట్ అండ్ బాల్ అందుకోబోతున్నారు. క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్కడ కూడా సేవలు బాగుంటాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు, సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది విద్యార్థులను ప్రోత్సహించడమే ఐఎస్‌బీసీ ప్రధాన లక్ష్యమని ఫౌండర్, సీఈవో కె. సునీల్ బాబు గతంలో చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులను పలు బృందాలుగా ఏర్పరిచి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోని క్రికెట్ ప్రతిభావంతుల్ని వెలికితీయడమే ఈ ఐఎస్‌బీసీ ప్రధాన లక్ష్యం.
Also Read: Kenya Road Accident: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి!