NTV Telugu Site icon

Sri Sri: యన్టీఆర్ ను శ్రీశ్రీ అంత మాట అన్నారా!?

Sri Sri

Sri Sri

Sri Sri: మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు తెలుగు సాహితీవనంలో ఈ నాటికీ విస్తరిస్తూనే ఉన్న వటవృక్షం. శ్రీశ్రీ ప్రభావంతో కలం పట్టి సాహితీహలం దున్నిన వారెందరో ఉన్నారు. ఈ నాటికీ శ్రీశ్రీ సాహిత్యం యువకవులు, నవకవులపై ప్రభావం చూపుతూనే ఉంది. చిత్రసీమలోనూ శ్రీశ్రీ పలు ప్రయోగాలు చేశారు. అయితే ఇతర సినీ గీత రచయితల్లాగా కాకుండా తన దరికి చేరిన అవకాశాలతో శ్రీశ్రీ తనదైన బాణీ పలికిస్తూ సాగారు. అలాంటి శ్రీశ్రీకి మొదటి నుంచీ నటరత్న యన్టీఆర్ అంటే వ్యతిరేకభావం ఉండేది. ఎందువల్ల అంటే ఆయన పౌరాణిక చిత్రాల ద్వారా మళ్ళీ తెలుగు జనం కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళారని చెప్పేవారు. దాంతో విభేదించేవారికి “నన్నర్థం చేసుకోవడం మీ తరం కాదు… యన్టీఆర్ అభినయాన్నయినా అర్థం చేసుకోండి…” అంటూ ఉండేవారు శ్రీశ్రీ. అందులోని మర్మం తెలియనివారు యన్టీఆర్ అంటే శ్రీశ్రీకి ఇష్టం లేదనే ప్రచారం సాగించారు. ఏ కారణంగానో కానీ, యన్టీఆర్ సొంత చిత్రాలలో శ్రీశ్రీ కలం పనిచేసిన దాఖలాలు కనిపించవు. అయితే యన్టీఆర్ హీరోగా నటించిన పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లోనూ శ్రీశ్రీ పాటల రచన సాగింది. శ్రీశ్రీ రాసిన పాటలకు యన్టీఆర్ అభినయించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. యన్టీఆర్ చెవిన కూడా కొందరు శ్రీశ్రీ ఆయనపై అన్న మాటలను వేశారు. అయితే ఆ మహాకవి ఏ మర్మంతో అన్నారో అంటూ రామారావు కూడా అంతగా పట్టించుకొనేవారు కారు.

‘అడవిరాముడు’ తరువాత యన్టీఆర్ కొంతకాలం మాస్ సినిమాల బాటనే పట్టారు. ఆయన నటనకు ప్రాధాన్యమిచ్చిన చిత్రాలు ఆ మాస్ హోరులో కొట్టుకు పోయాయి. రామారావులోని అసలైన నటుణ్ణి మళ్ళీ వెలికి తీస్తానని దర్శకరత్న దాసరి నారాయణ రావు సవాల్ విసరి మరీ ‘సర్దార్ పాపారాయుడు’ రూపొందించారు. అందులో శ్రీశ్రీ రాసిన “వినరా సోదర…” అంటూ సాగే బుర్రకథలో “ఒక యోధుడి మరణం శతవీరుల జననం…” అంటూ సాగే చరణాల్లో యన్టీఆర్ తనదైన బాణీ పలికించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలోనే శ్రీశ్రీకి ఓ సాంస్కృతిక సంస్థ సన్మానం చేయాలని భావించింది. తనకు సన్మానం చేయాలంటే యన్టీఆర్ ఆ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటే వస్తానని శ్రీశ్రీ ఓ నిబంధన పెట్టారు. చివరకు సదరు సంస్థ వెళ్ళి రామారావు సోదరుడైన త్రివిక్రమరావుతో ఈ విషయం చెప్పారు. రచయితలంటే అన్నగారికి ఎంతో గౌరవమని, అంతేకాదు శ్రీశ్రీ అంటే మరింత గౌరవమని త్రివిక్రమరావు చెప్పి, వారిని యన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్ళారు. వారు కార్యక్రమం పెట్టుకున్న తేదీకి రామారావు సమయం కేటాయించారు. ఆ వేదికపై శ్రీశ్రీ తన సహజధోరణిలో “నన్ను అర్థం చేసుకోవాలంటే యన్టీఆర్ కు కొన్ని జన్మలు పడుతుంది” అన్నారు. ఆ మాటకు యన్టీఆర్ ఏ మాత్రం నొచ్చుకోకుండా “పదండి ముందుకు…” అంటూ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’లోని మాటలనే వల్లిస్తూ, “పెద్దవారి మాటలు నాకు ఆశీస్సులు…” అని సెలవిచ్చారు. వెంటనే శ్రీశ్రీ “నిన్ను అర్థం చేసుకోవడం ఎవరి తరమూ కాదు…” అని మళ్ళీ అన్నారు. దాంతో ఆ కార్యక్రమంలో నవ్వులు పూశాయి. తరువాత ఎవరో శ్రీశ్రీని ఎందుకలా మాట్లాడారు, యన్టీఆర్ నొచ్చుకొని ఉంటారని చెప్పారు. అందరికీ యన్టీఆర్ కోపం వస్తే సహించడు అనే అభిప్రాయం ఉంది, కానీ, ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అది నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పారట శ్రీశ్రీ. మరి ఎందుకని ఆయన ‘పౌరాణికాల’పై వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు అని అడగ్గా, “ఇన్నాళ్ళయినా అర్థం చేసుకోని మీ లాంటి వారికి వివరించాల్సిందే…” అంటూ శ్రీశ్రీ తన మాటల్లోని మర్మాన్ని విడమరచి ఇలా చెప్పారట – “నిజానికి రామారావు సినిమా రంగంలో అడుగుపెట్టే నాటికి పౌరాణికాలకు కాలం చెల్లింది. మళ్ళీ యన్టీఆర్ తోనే తెలుగు సినిమా పౌరాణికాలు వెలిగాయి. అందువల్ల కొన్నేళ్ళు మన సినిమాను వెనక్కి తీసుకువెళ్ళారు అంటే అభివృద్ధిలో వెనక్కి తీసుకువెళ్ళడం కాదు. నిజానికి యన్టీఆర్ సినిమాలతోనే తెలుగు సినిమా ఓ వెలుగు వెలిగింది. అలా పౌరాణికాలను జనం దగ్గరకు చేర్చడంతోనే మనవాళ్ళలో సెంటిమెంట్స్ మరింత పెరిగాయి. అంటే యన్టీఆర్ అభినయంలో ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోండి!”. ఈ మాటలు విన్నాక, “అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవడం మా తరం కాదు…” అన్నారట శ్రీశ్రీని ప్రశ్నించిన వారు.