Hollywood Box Office: క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో మాట్ డామన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey) జూలై 17, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా, టామ్ హాలండ్ కథానాయకుడిగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుండి వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) జూలై 31, 2026 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భారీ హాలీవుడ్ చిత్రాలు ఇప్పటికే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్నాయి
సాధారణంగా హాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైతే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ లెక్కలు మారిపోతుంటాయి. అయితే ఈ సినిమాలు మాత్రం భారీ కలెక్షన్స్ తో పాటు, రికార్డుల కోసం కూడా పోటీపడుతున్న సినిమాలుగా నిలిచాయి. ఒకవైపు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి వారంలోనే సంచలన వసూళ్లు సాధిస్తే, మరోవైపు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ కేవలం మూడు వారాల్లోనే 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. మరి ఈ రెండు సినిమాలు ఇప్పటివరకు ఎంత వసూలు చేశాయి? భారతీయ కరెన్సీలో వాటి విలువ ఎంత? చివరకు ఎవరిది పైచేయి? అనే విషయాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదలైన మొదటి వారమే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మార్వెల్ మూవీ ఉత్తర అమెరికాలో కేవలం ఏడు రోజుల్లోనే 500 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే ఇది సుమారు రూ.4,700 కోట్లకు పైమాటే. అంతేకాదు, గతంలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ఎనిమిది రోజుల్లో సాధించిన ఈ రికార్డును ‘బ్రాండ్ న్యూ డే’ ఏడు రోజుల్లోనే అధిగమించింది. తొలి వారం ముగిసే సమయానికి ఉత్తర అమెరికాలో ఈ సినిమా సుమారు 511 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.4,800 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వేగం మరింత ఆశ్చర్యపరిచేలా ఉంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. మొదటి వారం ముగిసే సమయానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 808 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ 1.31 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.12,300 కోట్లకు సమానం. రెండో వారంలో కూడా ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ 1.66 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అంటే దాదాపు రూ.15,600 కోట్ల స్థాయికి ఈ సినిమా వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
భారత్‌లో కూడా ‘బ్రాండ్ న్యూ డే’కు భారీ స్పందన లభించింది. మొదటి వారంలోనే ఈ చిత్రం 44 మిలియన్ డాలర్లకు పైగా, అంటే సుమారు రూ.420 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను అధిగమించి ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ను టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ కూడా బాక్సాఫీస్ వద్ద తనదైన రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.008 బిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.9,500 కోట్లకు పైగా. ఇందులో ఉత్తర అమెరికా నుంచి 429.65 మిలియన్ డాలర్లు, విదేశీ మార్కెట్ల నుంచి 578.8 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం దేశీయంగా దాదాపు రూ.4,000 కోట్లకు పైగా, ఓవర్సీస్‌లో సుమారు రూ.5,400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
నోలన్ కెరీర్‌లో 1 బిలియన్ డాలర్ల మార్క్ దాటిన మూడో చిత్రంగా ‘ది ఒడిస్సీ’ నిలిచింది. ఇంతకుముందు ‘ది డార్క్ నైట్’ 1.008 బిలియన్ డాలర్లు, ‘ది డార్క్ నైట్ రైజెస్’ 1.08 బిలియన్ డాలర్లు వసూలు చేశాయి. ‘ఒపెన్‌హైమర్’ మాత్రం 1 బిలియన్ డాలర్లకు చేరువగా వెళ్లినా ఆ మార్క్‌ను అందుకోలేకపోయింది. ‘ది ఒడిస్సీ’ ప్రస్తుత వేగాన్ని బట్టి నోలన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మారే అవకాశం ఉంది.
ఈ సినిమాలో IMAX ఫార్మాట్‌ది కూడా కీలక పాత్ర. ఇప్పటివరకు IMAX నుంచి ‘ది ఒడిస్సీ’కి 257 మిలియన్ డాలర్లకు పైగా, అంటే దాదాపు రూ.2,400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. త్వరలోనే IMAX చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ఇది నిలిచే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రపంచంలో రెండో అతిపెద్ద సినిమా మార్కెట్ అయిన చైనాలో ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. అక్కడ సాధారణ థియేటర్లతో పాటు 800 IMAX స్క్రీన్లలో భారీగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
రెండు సినిమాల బాక్సాఫీస్ ప్రయాణాన్ని రూపాయల్లో పోలిస్తే ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వేగం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.12,300 కోట్లకు చేరుకున్న ఈ సినిమా, కేవలం ఆరు రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ‘ది ఒడిస్సీ’ మాత్రం మూడు వారాల్లో రూ.9,500 కోట్లకు పైగా వసూలు చేసి బిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ‘ది ఒడిస్సీ’కి చైనా విడుదల ఇంకా మిగిలి ఉండటంతో దాని తుది వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం వేగం విషయంలో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ, లైఫ్‌టైమ్ కలెక్షన్స్ విషయంలో ‘ది ఒడిస్సీ’ పోటీ ఇంకా ముగియలేదు. ఒకటి MCU ఫ్రాంచైజ్ పవర్‌తో దూసుకెళ్తుంటే, మరొకటి క్రిస్టోఫర్ నోలన్ పేరు, IMAX అనుభవం, భారీ విజువల్ స్కేల్‌తో ప్రపంచ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. చివరికి ఈ రెండు సినిమాల్లో ఎవరు అత్యధిక వసూళ్ల రికార్డును సొంతం చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

