(ఆగస్టు 15న సుహాసిని పుట్టినరోజు)
తెలుగునాట పుట్టకపోయినా, తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు ఎందరో కళాకారులు. వారిలో సుహాసిని స్థానం ప్రత్యేకమైనది. నిజానికి తమిళ చిత్రాలతోనే అరంగేట్రం చేసినా, తరువాత తెలుగు చిత్రాలతో సూపర్ హీరోయిన్ గా జేజేలు అందుకున్నారు సుహాసిని. తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన తరువాతే ‘సింధుభైరవి’తో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచారామె. తెలుగు చిత్రాల వల్లే తనలోని నటి మెరుగు పడిందని సుహాసిని గర్వంగా చెప్పుకొనేవారు. ఆమె కళాకారుల కుటుంబంలోనే జన్మించడం వల్ల సహజంగానే చిత్రసీమవైపు ఆకర్షితురాలయిందని చెప్పవచ్చు. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మణిరత్నంను వివాహమాడిన తరువాత సుహాసిని సైతం మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పటికీ తెలుగు చిత్రాలలో నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారామె.
సుహాసిని తండ్రి చారుహాసన్, బాబాయిలు చంద్రహాసన్, కమల్ హాసన్ అందరూ చిత్రసీమలో నటులుగా, నిర్మాతలుగా రాణించినవారే. ఇక చిన్న బాబాయ్ కమల్ హాసన్ సకలకళావల్లభుడు అని పేరు సంపాదించారు. సుహాసిని చదువుకొనే రోజులకే కమల్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నారు. దాంతో సుహాసిని మనసు కూడా చిత్రసీమవైపు మళ్ళింది. తొలుత బాలు మహేంద్ర వద్ద సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నారు. తరువాత దర్శకుడు మహేంద్రన్ ప్రోత్సాహంతో ‘మౌనగీతం’తో నటిగా మారారు. ఆ పై భారతీ రాజా రూపొందించిన తెలుగు సినిమా ‘కొత్తజీవితాలు’తో తెలుగువారికి పరిచయమయ్యారు. అలా రెండు సినిమాలతోనే సుహాసినికి గుర్తింపు లభించింది. ‘బహుదూరపు బాటసారి’లో ఏయన్నార్ కూతురుగా మూగ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు సుహాసిని. శోభన్ బాబుతో “ఇల్లాలు-ప్రియురాలు, బావ-మరదళ్ళు, శ్రావణసంధ్య” వంటి హిట్ మూవీస్ లో నటించారు. కృష్ణ సరసన “తేనె మనసులు, చుట్టాలబ్బాయి” వంటి చిత్రాల్లో కనిపించారు సుహాసిని. అయితే చిరంజీవి, బాలకృష్ణకు మాత్రం హిట్ పెయిర్ గా అలరించారు. చిరంజీవితో ఆమె నటించిన “మంచు పల్లకి, మగమహారాజు, ఛాలెంజ్, చంటబ్బాయ్, రాక్షసుడు, మంచిదొంగ, మరణమృదంగం”వంటివి అలరించాయి. ఇక బాలకృష్ణకు తొలి సూపర్ డూపర్ హిట్ ‘మంగమ్మగారి మనవడు’లో సుహాసిని నాయిక. తరువాత “ప్రెసిడెంట్ గారబ్బాయి, బాలగోపాలుడు, రాముడు-భీముడు” చిత్రాల్లోనూ బాలయ్యతో జోడీ కట్టి అలరించారు సుహాసిని. నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’, వెంకటేశ్ తో ‘వారసుడొచ్చాడు’ వంటి విజయాలనూ చూశారామె.
క్రాంతి కుమార్ తెరకెక్కించిన ‘స్వాతి’ చిత్రంతో సుహాసిని ఉత్తమనటిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తరువాత ఆమె కెరీర్ మారిపోయిందనే చెప్పాలి. పలు మహిళా చిత్రాలలో సుహాసిని ప్రధాన పాత్రలు పోషించి మెప్పించారు. “సంసారం ఒక చదరంగం, లాయర్ సుహాసిని, స్రవంతి, గౌతమి” వంటి చిత్రాలతో సుహాసిని జనం మదిని దోచారు. సూపర్ హీరోయిన్ గానూ రాణించారు. పెళ్ళయిన తరువాత నుంచీ కాస్త సినిమాలు తగ్గించినా, తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తూ వచ్చారు. తమిళ చిత్రం ‘సింధుభైరవి’తో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్నా, తెలుగు చిత్రాలే తనకు ఎంతో గుర్తింపును సంపాదించాయని ఆమె అంగీకరిస్తారు. “పెణ్, ఇందిరా, పుదమ్ పుదు కాలై” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో ‘పెణ్’ టీవీ సీరీస్ కావడం విశేషం. భర్త మణిరత్నం తెరకెక్కించిన “తిరుడా తిరుడా, ఇరువర్, రావణన్” చిత్రాలకు రచనలోనూ పాలు పంచుకున్నారామె. ఏది ఏమైనా తెలుగునాట మాత్రం జనం మదిలో ‘నవ్వుల రాణి’గా ముద్రవేసుకున్న సుహాసిని, తన బహుముఖ ప్రజ్ఞను పలుమార్లు ప్రదర్శించారని చెప్పవచ్చు.