NTV Telugu Site icon

‘జూబిలీ కుమార్’ రాజేంద్రకుమార్

(జూలై 20న రాజేంద్రకుమార్ జయంతి)

చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. వద్దనుకున్నా కొందరిని అందలమెక్కిస్తుంది. కోరుకున్నా మరికొందరినీ తారాపథానికి దూరంగానే నిలుపుతుంది. ప్రఖ్యాత హిందీ నటుడు రాజేంద్రకుమార్ చిత్రసీమలో రాణిస్తే చాలు అనుకొని కాలుపెట్టారు. కానీ, ఆయన ఊహించని విధంగా నటుడయ్యారు, హీరో అనిపించుకున్నారు, స్టార్ హీరోగా జేజేలు అందుకున్నారు. వరుస రజతోత్సవాలతో ‘జూబిలీ కుమార్’ అనీ పిలిపించుకున్నారు. హిందీ చిత్రసీమలో రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న రోజుల్లో రాజేంద్రకుమార్ సైతం విజయవిహారం చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలలో హీరోగా, కేరెక్టర్ యాక్టర్ గా, కీ ప్లేయర్ గా నటించి మెప్పించారు రాజేంద్రకుమార్.

చిత్రం… విచిత్రం…
రాజేంద్రకుమార్ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. కరాచీలో వీరి కుటుంబం వ్యాపారం చేసేది. దేశవిభజనతో పాకిస్థాన్ లోనే ఆస్తులన్నీ వదిలేసి వచ్చారు రాజేంద్రకుమార్ పెద్దలు. దాంతో రాజేంద్రకుమార్ చిత్రసీమలో ఏదో ఒక పనిచేసుకొని జీవిద్దామని అడుగుపెట్టారు. దర్శకనిర్మాత హెచ్.ఎస్.రావెల్ వద్ద ఐదేళ్ళు అసిస్టెంట్ గా పనిచేశారు. 1949లో రావెల్ తెరకెక్కించిన ‘పతంగ’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు రాజేంద్ర. తరువాత దిలీప్ కుమార్, నర్గీస్ జంటగా నటించిన ‘జోగన్’లోనూ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాచూసిన దేవేంద్ర గోయెల్ తన ‘వచన్’లో రాజేంద్రకుమార్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించి, రాజేంద్రకు తొలి రజతోత్సవం చూపింది. ‘మదర్ ఇండియా’లో నర్గీస్ కు రాజేంద్రకుమార్, సునీల్ దత్ కొడుకులుగా నటించారు. తరువాతి రోజుల్లో సునీల్ దత్, నర్గీస్ పెళ్ళాడారు. అలాగే ఆ కుటుంబంతో రాజేంద్ర అనుబంధం కొనసాగింది. సునీల్, రాజేంద్ర వియ్యంకులు అయ్యారు.

బాలీవుడ్ తొలి సూపర్ స్టార్!
రాజేంద్రకుమార్ 1959లో నటించిన “గూంజ్ ఉఠీ షెహనాయి” ఘనవిజయం సాధించి, రజతోత్సవం చూసింది. “ధూల్ కా ఫూల్, ఘరానా, దిల్ ఏక్ మందిర్, మేరే మెహబూబ్, ఆయీ మిలన్ కీ బేలా, ఆర్జూ, సూరజ్, జుక్ గయాఆస్మాన్, తలాష్, గన్వార్, గీత్” చిత్రాలు రాజేంద్రకుమార్ ను ‘జూబిలీ కుమార్’గా నిలిపాయి. ఆయన అభినయానికి అవార్డులు లభించక పోయినా, ప్రేక్షకుల రివార్డులు మాత్రం విశేషంగా దక్కాయి. అందుకే కొందరు ‘బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్’ అని రాజేంద్రకుమార్ ను పిలుస్తూ ఉంటారు. ‘గోరా ఔర్ కాలా’లో ద్విపాత్రాభినయం చేసిన రాజేంద్రకుమార్, ఆ తరువాత కొంతకాలమే సూపర్ స్టార్ గా సాగారు. తరువాతి రోజుల్లో రాజేశ్ ఖన్నా ఆగమనంతో రాజేంద్రకుమార్ చిత్రాలు వరుస పరాజయాలు చూశాయి. వెంటనే రాజేంద్రకుమార్ కేరెక్టర్ రోల్స్ కు టర్న్ అయిపోయారు. రాజేంద్రను బీట్ చేసినందుకు రాజేశ్ ఖన్నాను ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అంటూ ఉంటారు.

రాజ్… రాజేంద్ర…
రాజేంద్రకుమార్ కు రాజ్ కపూర్ తో సత్సంబంధాలు ఉండేవి. రాజ్ రూపొందించిన ‘సంగం’లో రాజేంద్రకుమార్ సైడ్ హీరోగా నటించారు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత నుంచీ రాజ్, రాజేంద్ర మరింత దగ్గరయ్యారు. రాజ్ రూపొందించిన ‘మేరా నామ్ జోకర్’లో రాజేంద్ర ఓ కీలక పాత్రలో కనిపించారు. తరువాత వీరిద్దరూ ప్రధాన భూమికలు పోషించిన “దో జాసూస్” అంతగా అలరించలేకపోయింది. రాజేంద్రకుమార్ తనయుడు కుమార్ గౌరవ్ హీరోగా కొన్ని చిత్రాలలో నటించాడు. రాజ్ కపూర్ కూతురు రీమాను, రాజేంద్రకుమార్ తనయుడు కుమార్ గౌరవ్ కు నిశ్చితార్థం చేశారు. అయితే వారిద్దరూ గౌరవంగా ఆ నిశ్చితార్థాన్ని వదలుకున్నారు. అప్పటి నుంచీ రాజ్ తో రాజేంద్ర సాన్నిహిత్యంగా సాగలేకపోయారు. అయితే రాజేంద్రకు మరో ఆప్తమిత్రుడు సునీల్ దత్ కూతురు నమ్రతా దత్ ను కుమార్ గౌరవ్ వివాహమాడారు.

సునీల్ రాజేంద్ర బంధం!
రాజేంద్రకుమార్, సునీల్ దత్ – ఇద్దరూ ‘మదర్ ఇండియా’లో నర్గీస్ కు తనయులుగా నటించారు. రియల్ లైఫ్ లో నర్గీస్, రాజ్ కపూర్ లవర్స్. అయితే అప్పటికే రాజ్ కు వివాహం కావడంతో వారి ప్రేమ ఫలించలేదు. కానీ, నర్గీస్ ను మనస్పూర్తిగా ప్రేమించిన సునీల్ దత్ ఆమెను వివాహమాడారు. కడదాకా, భార్యను సునీల్ దత్ ఎంతో ప్రేమగా చూసుకోవడంతో ఆయనను అందరూ ‘రియల్ లవర్’ అనేవారు. నర్గీస్, సునీల్ వివాహం మొదలు ఆ కుటుంబంతో రాజేంద్రకుమార్ ఎంతో అనుబంధం పెంచుకున్నారు. నర్గీస్ ను సొంత చెల్లెలుగానే భావించేవారు. చివరకు సునీల్, నర్గీస్ కూతురు నమ్రతను తన కోడలుగా చేసుకున్నారు రాజేంద్రకుమార్. ఆయన తనయుడు కుమార్ గౌరవ్ “లవ్ స్టోరీ, తేరీ కసమ్, స్టార్, నామ్, కాంటే” చిత్రాలలో హీరోగా నటించారు. సునీల్, నర్గీస్ తనయుడు సంజయ్ దత్ ‘నామ్’ చిత్రంలో కుమార్ గౌరవ్ తో కలసి నటించాడు. ఈ సినిమాకు సంజయ్ కి మంచి పేరు సంపాదించి పెట్టింది. సునీల్ దత్ ఎన్నికల సమయంలో రాజేంద్ర కుమార్ ప్రచారం చేసేవారు. ఇక సంజయ్ దత్ ను అరెస్ట్ చేసి, తరచూ సునీల్ దత్ ఇంటిని పోలీసులు సోదాలు చేసినప్పుడు కూడా సునీల్ కు నైతిక బలం ఇస్తూ ఆయన చెంతనే ఉన్నారు రాజేంద్రకుమార్. అందుకే, “రాజేంద్ర కుమార్ వంటి మంచి మిత్రుడు లభించడం నాఅదృష్టం” అని సునీల్ దత్ తరచూ చెబుతూ ఉండేవారు. బాలీవుడ్ లోనూ అందరితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న రాజేంద్రకుమార్ తన 71వ యేట కన్నుమూశారు. ఇప్పటికీ బాలీవుడ్ లో సక్సెస్ గురించి చర్చ సాగిన ప్రతీసారి ఈ ‘జూబిలీ కుమార్’ను జనం తలచుకుంటూనే ఉండడం విశేషం!