NTV Telugu Site icon

సినారె… సినిమా పాటల కినారే…

Remembering Dr C Narayana Reddy on his Birth Anniversary

(జూలై 29న డాక్టర్ సి.నారాయణ రెడ్డి జయంతి)
తెలుగు చిత్రసీమ గీతరచనను సింగిరెడ్డి నారాయణ రెడ్డికి ముందు, తరువాత అని విభజించవలసి ఉంటుంది. సినారెకు ముందు గీతరచయితల పోకడలూ, ఆయన తరం వారి బాణీలు, భావితరాన్ని ముందే ఊహించి పలికించిన పదబంధాలు అన్నిటినీ కలిపి చూస్తే తెలుగు సినిమా రంగంలో సినారె చేసిన ప్రయోగాలు మరెవ్వరూ చేసి ఉండరని చెప్పక తప్పదు. సినారెకు ముందు కొందరు పాటలతో పాటు మాటలూ పలికించారు. ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ వంటి చిత్రాలకు సినారె కలం సంభాషణలూ రచించింది. అవి సాహితీప్రియులను మాత్రమే అలరించగలిగాయి. కానీ, ఆయన గీతాలు పండితపామరభేదం లేకుండా అందరికీ ఆనందం పంచాయి. ఛాందసాన్ని వల్లించినా, ధర్మాన్ని చాటిచెప్పిన బలం సినారె కలంలో ఉంది. అణువూ అణువున దైవం ఉన్నాడన్న సత్యాన్ని బోధించిన ఆస్తికత్వమూ కనిపిస్తుంది. తెలుగువాడయినందుకు తెలుగును విశేషంగా అభిమానిస్తూ ‘తెలుగుజాతి మనది…నిండుగ వెలుగుజాతి మనది…’ అంటూ నినదించిన వైనమూ గోచరమవుతుంది. స్వరకల్పన చేసేవారికి సవాల్ విసిరే పదబంధాలను పేర్చడంలోనూ, బాణీలకు తగ్గ వాణిని వినిపించడంలోనూ సినారె కలం చేసిన విన్యాసాలు అనితరసాధ్యం అనిపించక మానవు. తరువాతి తరం కవులకు దారి ఇస్తూ ఆయన పక్కకు తొలగినపుడు సినారె పని అయిపోయింది అనుకున్నారు. కానీ, ఆ కవిపుంగవులను పరిచయంచేసిన దిగ్దర్శకులే మళ్ళీ సినారె కవనం కోసం పరుగులు తీశారు. ఇలాంటి పరిస్థితి మరో గీతరచయితకు ఎదురు కాలేదనే చెప్పాలి. మళ్ళీ తన దరికి చేరిన వారికి సినారె కలం మరపురాని మధురామృతమే పంచింది. అదీ సినారె కలం ప్రత్యేకత!

మాతృభాషపై మమకారం
సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లా హనుమాజీ పేట అనే మారుమూల గ్రామంలో జన్మించారు. కన్నవారు నేర్పించిన తెలుగుతోనే మాతృభాషపై మమకారం పెంచుకున్నారు. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు చూస్తూ తెలుగుపలుకును ప్రేమించారు. కానీ, పాఠశాలలో మాత్రం ఉర్దూ మాధ్యమంలో విద్యనభ్యసించారు. బి.ఏ.దాకా ఉర్దూ మీడయంలోనే చదివినా, మాతృభాష తెలుగును మాత్రం మరువలేదు. అందులో ఎప్పటికప్పుడు సాధన చేస్తూ సాగారు. తెలుగుసాహిత్యంలో ఎమ్.ఏ.చేసి, తరువాత సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. హైదరాబాద్ రామకోటి ప్రాంతంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో అనేక ప్రాచీనగ్రంథాలు అధ్యయనం చేశారు. “జలపాతం, విశ్వగీతి, నాగార్జున సాగరం, అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు, విశ్వనాథనాయుడు” వంటి రచనలు చేసి, తెలుగు సాహితీప్రియులను ఆనందసాగరంలో మునకలు వేయించారు.

యన్టీఆర్ అనే సింహద్వారం ద్వారా…
నారాయణ రెడ్డి కవితావైభవం గురించి తెలిసిన నటరత్న యన్టీఆర్ చిత్రసీమకు రమ్మని ఆహ్వానించారు. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన జానపద చిత్రం ‘గులేబకావళి కథ’లో అన్ని పాటలూ రాసి మెప్పించారు సినారె. ఈ సినిమా కోసం సినారె కలం పలికించిన తొలి పాట “నన్ను దోచుకుందువటే… వన్నెల దొరసాని…”- ఆ రోజుల్లో ఈ పాట తెలుగువారిని విశేషంగా అలరించింది. ఇందులోనే యువతను ఉర్రూతలూగించిన “మదనా సుందర నా దొరా…” పాట, “వంటిరినై పోయాను…” అనే విషాదగీతం, “సలామ లేకుం… సాయెబుగారూ…” అంటూ ఉర్దూ పదాలు పలికిస్తూ రాసిన పాట అన్నీ జనాన్ని మురిపించాయి. ఇక “కలల అలలపై తేలె మనసు మల్లెపూవై…” పాట సంగీతసాహితీప్రియులను ఆకట్టుకుంది. జోసెఫ్ కృష్ణమూర్తి స్వరకల్పనలో సినారె రాసిన పాటలన్నీ ‘గులేబకావళి కథ’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చిత్రసీమలో…
తొలి చిత్రంలోనే పాటలతో పరవశింపచేసిన సినారెకు, తరువాత బి.యన్.రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, కె.ప్రత్యగాత్మ వంటి నాటి మేటి దర్శకులందరూ సినారె కవిత్వం కోసం సన్నివేశాలను ఏర్పాటు చేశారు. అన్నిటా తనదైన బాణీ పలికిస్తూ సినారె పాటలు రాసి పరమానందం పంచారు. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో తప్పకుండా సినారె పాటలు ప్రధాన ఆకర్షణగా ఉండేవి. అప్పటి వర్ధమాన కథానాయకులు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, రామకృష్ణ, హరనాథ్ వంటి వారి చిత్రాలలోనూ సినారె పాటలు పరవశింపచేశాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ తన తొలిచిత్రం ‘ఆత్మగౌరవం’ మొదలు ‘జీవనజ్యోతి’ దాకా ప్రతి చిత్రంలోనూ సినారె పాటలకు చోటు కల్పిస్తూ సాగారు. తరువాతి రోజుల్లో విశ్వనాథ్ వేటూరి, సిరివెన్నెలతో పాటలు రాయించుకున్నా, అవసరమైన సమయంలో ‘స్వాతిముత్యం, స్వాతికిరణం’ వంటి చిత్రాలకు మళ్ళీ సినారెతోనే గీతరచన చేయించడం విశేషం. ఇలా ఎందరో సినారె పాటకు పట్టాభిషేకం చేశారు. దాసరి, కోడి రామకృష్ణ వంటి దర్శకులు సైతం తమ చిత్రాలలో సినారె పాటకు ప్రత్యేక స్థానం కల్పించారు. కొందరు నిర్మాతలు సినారె పాట లేకుంటే సినిమానే తీయమని భీష్మించుకున్న రోజులూ ఉన్నాయి.

యన్టీఆర్ తో అనుబంధం…
సినారె ఎందరు దర్శకనిర్మాతలకు, నటీనటులకు పాటలు రాసినా ఆయన కలం మాత్రం యన్టీఆర్ సినిమాలు అనగానే ప్రత్యేక శ్రద్ధ చూపించేది. బహుశా, తనను సినిమారంగానికి పరిచయం చేశారన్న కృతజ్ఞతా భావం కారణమై ఉండవచ్చు. యన్టీఆర్ సైతం తాను నటించిన పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలలో సినారెకు అవకాశాలు కల్పిస్తూ సాగారు. చారిత్రక, జానపద, పురాణ, సాంఘికాల్లో యన్టీఆర్ కథానాయకునిగా అపూర్వ విజయాలు చూశారు. అలాగే ఈ నాలుగు రకాల చిత్రాలలో నటదర్శకునిగానూ విజయం సాధించారాయన. వీటన్నిటా సినారె పాటలు
చోటు చేసుకొని జనాన్ని అలరించడం మరింత విశేషం. ‘గులేబకావళి కథ’ తరువాత యన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’లో సినారె కలం పలికించిన ‘స్వాగతం…సుస్వాగతం…’ పాట ఈ నాటికీ స్వాగత గీతంగా జేజేలు అందుకుంటూనే ఉంది. ‘వరకట్నం’లో “ఇదేనా మన సంప్రదాయమిదేనా…” అంటూ దురాచారాన్ని ఎండగట్టిన వైనం ఇప్పటికీ తగినట్టుగానే అనిపిస్తుంది. “తెలుగుజాతి మనది… నిండుగ వెలుగుజాతి మనది…” అంటూ ‘తల్లా-పెళ్ళామా’లో చాటిన వైనం పులకింపచేస్తుంది. ‘దానవీరశూరకర్ణ’లో “జయీభవా విజయీభవా…” అంటూ సంస్కృత సమాసాలతో అలరించిన తీరును సాహితీప్రియులు మరవలేరు. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన “తాతమ్మ కల, చాణక్య-చంద్రగుప్త, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీరామపట్టాభిషేకం, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, చండశాసనుడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సమ్రాట్ అశోక” అన్నిటా సినారె పాట పల్లవించింది. యన్టీఆర్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘సమ్రాట్ అశోక’లోనే కాదు, ఆయన నటించగా విడుదలైన ఆఖరి సినిమా ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లోనూ సినారె పాటలు పలికించడం విశేషం. ఇలా రామారావుతో కడదాకా అనుబంధంతో సాగారు సినారె. యన్టీఆర్ ను సినారె “కారణ జన్ముడు… రణ జన్ముడు…” అంటూ తరచూ కీర్తించేవారు. రామారావు తుదిశ్వాస విడిచిన రోజున పసిపిల్లాడిలా సినారె కన్నీరుమున్నీరయ్యారు.

సినారె ‘విశ్వంభర’
అనేక చిత్రాలలో అద్భుతమైన గీతాలు పలికించిన సినారెకు అగణనీయమైన సాహితీపురస్కారాలు లభించాయి. అయితే ‘ప్రేమించు’లోని “కంటేనే అమ్మ అని అంటే ఎలా…” పాటతోనే సినారె తొలి నంది అవార్డును అందుకోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. తరువాత హరికృష్ణ హీరోగా రూపొందిన ‘సీతయ్య’లోని “ఇదిగో రాయలసీమ గడ్డ…” పాటకు కూడా సినారెకు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు లభించింది. 1997లో సినారె రాజ్యసభ సభ్యునిగా చట్టసభలో అడుగుపెట్టారు. అక్కడ కూడా తనదైన బాణీ పలికిస్తూ ఉర్దూలో షాయిరీలు వినిపిస్తూ ప్రసంగించి పులకింపచేసేవారు. ఆయన రాసిన ‘విశ్వంభర’ కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. చివరి దాకా కవితారచన సాగిస్తూనే సినారె 2017 జూన్ 12న తుదిశ్వాస విడిచారు. సినారె లేకపోయినా, ఆయన అందించిన మధురామృతం తెలుగువారిని పులకింపచేస్తూనే ఉంది.